రైల్వే బడ్జెట్ 2012-13
రైల్వే మంత్రి దినేష్ త్రివేది మార్చి 14, 2012న లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దశాబ్దకాలం తర్వాత అన్ని కేటగిరీల రైలు ఛార్జీలు పెరిగాయి. ప్రయాణ ఛార్జీలను పెంచడానికి గత పదేళ్ల కాలంలో ఏ రైల్వే మంత్రీ సాహసించలేదు. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ దినేష్ త్రివేది తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లోనే ఏకంగా రూ. 4,500 కోట్ల ఛార్జీల భారం మోపి సంచలనం సృష్టించారు.
2012-13 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 60,100 కోట్ల ప్రణాళికా కేటాయింపులు చేశారు. ఇందులో కేంద్రసాయం రూ. 24,000 కోట్లు, అంతర్గత వనరులు రూ. 18,050 కోట్లు, డీజిల్‌పై సర్‌ఛార్జి రూ. 2,000 కోట్లు, మార్కెట్ రుణాలు రూ. 15,000 కోట్లు, ఇతరాలు రూ. 1,050 కోట్లు ఉన్నాయి.
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు:
¤ రైల్వేలో కీలక ఆదాయ వనరైన సరకు రవాణ పైనే రైల్వేశాఖ ఈసారి కూడా దృష్టి సారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరకు రవాణా ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమైంది. కొత్త బడ్జెట్‌లో అంచనాల ప్రకారం 2012-13లో సరకు రవాణా ఆదాయ లక్ష్యాన్ని రూ. 89,339 కోట్లుగా నిర్దేశించుకుంది. ఇది ఈ ఏడాది సవరణ లక్ష్యం కంటే 30.2 శాతం ఎక్కువ.