October-2012

ఆసియాలోనే పెద్ద రేడియో టెలిస్కోప్ ను ఆవిష్కరించిన చైనా
ఉపగ్రహాలు, అంతరిక్షానికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించే పెద్ద రేడియో టెలిస్కోప్‌ను చైనా ఆవిష్కరించింది. 65 మీటర్ల వ్యాసం కలిగిన, ఆసియాలో పెద్దదైన ఈ టెలిస్కోప్‌ను షాంఘైలో ఏర్పాటు చేశారు. ఇందులో ఎనిమిది ఫ్రీక్వెన్సీ బాండ్లు ఉంటాయి.

హిల్లరీ మాంటెల్‌కు మ్యాన్ బుకర్ ప్రైజ్
బ్రిటిష్ నవలా రచయిత్రి హిల్లరీ మాంటెల్ (60)కు 2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ‘మాన్ బుకర్ ప్రైజ్’ను లండన్‌లో అక్టోబర్ 17న బహూకరించారు. మాంటెల్‌కు బహుమతి కింద 50,000 పౌండ్లు (రూ.40 లక్షలు) లభించాయి. చారిత్రక నవల ‘బ్రింగ్ ఆఫ్ ద బాడీస్’కుగాను ఆమెకు ఈ పురస్కారం దక్కింది. బ్రిటిష్ చరిత్రకు చెందిన అంశాన్ని ఈ నవలలో ఆవిష్కరించారు. మూడేళ్లలో ఆమెకిది రెండో మ్యాన్ బుకర్ ప్రైజ్. కాల్పనిక సాహిత్యంలో ఈ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న తొలి మహిళగా, తొలి బ్రిటిష్ రచయితగా ఆమె చరిత్ర సృష్టించారు. గతంలో ఆస్ట్రేలియా రచయిత పీటర్ కారే(1988, 2001), దక్షిణాఫ్రికా రచయిత జె..ఎం.కొయిట్టీ(1983, 1999)లు రెండు సార్లు ఈ అవార్డు అందుకున్నారు.

కంబోడియా మాజీ రాజు షిహనౌక్ మృతి
కంబోడియా దేశ మాజీ రాజు నరోడమ్ షిహనౌక్ (89) అక్టోబర్ 15న ఫోమ్‌ఫెన్‌లో మరణించారు. ఆయన 1941లో సింహాసనం అధిష్టించి 2004లో అనారోగ్యంతో అధికారం నుంచి వైదొలిగారు. 1953లో ఫ్రాన్స్ నుంచి కంబోడియా పూర్తి స్వాతంత్య్రం పొందేందుకు షిహనౌక్ కృషి చేశారు.

మాలీలో సైనిక చర్యకు భద్రతా మండలి ఆమోదం
మాలీ ఉత్తర ప్రాంతంలోని ఇస్లామిక్ తిరుగు బాటుదారుల అణచివేతకు సైనిక చర్య చేపట్టేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అక్టోబర్ 13న ఆమోదం తెలిపింది. సైనిక చర్యపై 45 రోజుల్లోపు సవివరమైన ప్రణాళికను అందజేయాలని ఆఫ్రికన్ సంస్థలను భద్రతా మండలి కోరింది. మాలీ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సమన్వయ సహకారాలందించాలని కూడా ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలను భద్రతా మండలి కోరింది. మాలి ఉత్తర ప్రాంతంలోని ఇస్లామ్ గ్రూపులు, తురెగ్ తిరుగుబాటుదారులు ఉత్తర ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని గత మార్చిలో అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించారు. అప్ప టి నుంచి మాలీ ప్రభుత్వం, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ సంస్థ ‘ఏకోవాజ్’ అంతర్జాతీయ దేశాల జోక్యానికి భద్రతా మండలి ఆమోదం తెలపాలని కోరుతున్నాయి.

వెనెజులా అధ్యక్షుడిగా ఛావెజ్ తిరిగి ఎన్నిక
వెనెజులా అధ్యక్షుడిగా హ్యుగో ఛావెజ్ తిరిగి ఎన్నికయ్యారు. అక్టోబర్ 8న ప్రకటించిన అధ్యక్ష ఎన్నికల్లో ఛావెజ్‌కు 54.42 శాతం ఓట్లు వచ్చాయి. అక్టోబర్ 7న జరిగిన ఓటింగ్‌లో 19 మిలియన్ల వెనెజులా ఓటర్లు పాల్గొన్నారు. ఛావెజ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. ఈ విజయంతో 2013 జనవరి నుంచి మరో ఆరేళ్లపాటు అధ్యక్షుడిగా ఛావెజ్ కొనసాగుతారు.

శాంతి ఒప్పందానికి ఎంఎల్‌ఎఫ్ అంగీకారం
ఫిలిప్పైన్స్ ప్రభుత్వంతో శాంతి ప్రణాళికకు ముస్లిం తిరుగుబాటు గ్రూపు మరో ముస్లిం లిబరేషన్ ఫ్రంట్ అంగీకరించింది. ఈ ప్రణాళికను ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు బెనెగ్నో అక్వినో అక్టోబర్ 7న ప్రకటించారు. దీంతో దశాబ్దం నుంచి కొనసాగుతున్న వేర్పాటు పోరాటం ముగియనుంది. ఈ తిరుగుబాటులో ఒక లక్ష యాభై వేల మంది మరణించారు. ఈ ఒప్పందం ప్రకారం ఫిలిప్పైన్స్ దక్షిణ ప్రాంతం ‘మిండనావో’కు అర్ధ స్వయం ప్రతిపత్తిని కల్పిస్తారు. ఈ ప్రాంతం స్వయంప్రతిపత్తి కోసం 1970 నుంచి పోరాడుతున్నారు.

కువైట్ పార్లమెంట్ రద్దు
కువైట్ పార్లమెంటును రద్దు చేస్తూ రాజు షేక్ నబాహ్ అల్ అహ్మద్ అల్ నబాహ్ అక్టోబర్ 7న డిక్రీ జారీ చేశారు. కువైట్ రాజ్యాంగం ప్రకారం 60 రోజుల్లో (డిసెంబర్ 7 లో పు) సాధారణ ఎన్నికలు నిర్వహించాలి. 50 మంది సభ్యులున్న పార్లమెంటు రద్దుతో ఈ ఏడాది రెండోసారి మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. 2009 ఎన్నికల్లో ఏర్పడిన పార్లమెంటులోని కొందరు ఎంపీలపై ఆరోపణలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఇస్లామిస్టుల నేతృత్వంలోని పార్టీ ఎన్నికను రాజ్యాంగ కోర్టు రద్దు చేసి 2009 నాటి పార్లమెంట్‌ను పునరుద్దరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని నిరసిస్తూ సమావేశాల బహిష్కరణ, దేశవ్యాప్త నిరసనలతో పార్లమెంట్‌ను రద్దు చేయాలని కేబినెట్ కూడా సిఫార్సు చేసింది.
విమాన వాహక నౌక ‘లియోనింగ్’
చైనా మొదటి విమాన వాహక నౌక ‘లియోనింగ్’ను సెప్టెంబర్ 25న లాంఛనంగా ప్రారంభించింది. 1998లో ఉక్రెయిన్ నుంచి పొందిన ‘వార్‌యాంగ్’ విమాన వాహక నౌకను చైనా పూర్తి సామర్థ్యంతో నిర్మించి లియోనింగ్‌గా పేరు పెట్టింది. దీంతో చైనా నౌకా దళ సామర్థ్యం బాగా పెరుగుతుంది. సంప్రదాయేతర ప్రమాదాలనే కాకుండా ప్రకృతి విపత్తులపై ప్రతిస్పందించేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.

నార్వే మంత్రిగా పాక్ సంతతి మహిళ
నార్వే సాంస్కృతిక శాఖ మంత్రిగా పాకిస్థాన్ సంతతికి చెందిన హదియా తజిక్(29) ను ఆ దేశ ప్రధానమంత్రి జీన్స్ స్టోల్‌టెన్‌బెర్గ్ సెప్టెంబర్ 24న నియమించారు. నార్వేలో ఈమె మొదటి ముస్లిం మహిళే కాకుండా అత్యంత పిన్న వయసు కలిగిన మంత్రి.

లాహోర్ కూడలికి భగత్ సింగ్ పేరు
అవిభాజ్య భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిషర్లపై వీరోచితంగా పోరాడిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ గుర్తుగా పాకిస్థాన్ ఆ దేశంలోని లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌కు భగత్‌సింగ్ చౌక్‌గా పేరు పెట్టింది. 1931 మార్చిలో భగత్‌సింగ్‌ను ఉరితీసిన నాటి లాహోర్ జైలు ఉన్న ప్రదేశంలోనే ప్రస్తుత కూడలిని నిర్మించారు.

సూకీకి అమెరికా వర్సిటీ డాక్టరేట్
మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీకి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ సెప్టెంబర్ 29న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఐరాస సదస్సులో హర్‌దీప్ ప్రసంగం
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ పాలనపై ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ 67వ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భారత్ తరఫున యూఎన్‌లో భారత్ శాశ్వత ప్రతినిధి హర్‌దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు. సెప్టెంబర్ 25న సదస్సులో ప్రసంగిస్తూ సంక్షోభ సమయాల్లో ఏ దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ అనధికార జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని సూచించారు.

Total Pageviews

1067548

Template Information

Template Information