March - 2012



సౌమిత్ర ఛటర్జీకి దాదాసాహెబ్ ఫాల్కే
బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ 2011 సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే రూపొందించిన ‘అపూర్ సంసార్’ చిత్రంతో 1959లో సినీ రంగంలోకి అడుగిడిన సౌమిత్ర దాదాపు 400పైగా చిత్రాల్లో నటించారు. కేంద్ర ప్రభుత్వం 2004లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. భారత ప్రభుత్వం అందజేసే అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ అవార్డును 1969లో ప్రముఖ దర్శకుడు-నిర్మాత, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలిచే దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఏర్పాటు చేశారు. పురస్కారం కింద రూ.10 లక్షల నగదు, స్వర్ణ కమలం బహూకరిస్తారు.

దేశంలో తగ్గిన పేదరికం
దేశంలో పేదరికం తగ్గి 2009-10 నాటికి 29.8 శాతానికి చేరుకుందని కేంద్ర ప్రణాళికా సంఘం మార్చి 19న విడుదల చేసిన తాజా అంచనాలు వెల్లడించాయి. 2004-05 తో పోలిస్తే ఇది 7.3 శాతం తక్కువ. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో తగ్గుదల ఎక్కువగా ఉంది. 2004-05 నాటికి దేశంలో పేదల సంఖ్య 40.72 కోట్లు (37.2 శాతం) ఉండగా 2009-10కి ఇది 34.47 కోట్ల(29.9 శాతం)కు చేరుకుంది. ఈ ఐదేళ్లలో గ్రామీణ పేదల సంఖ్య 8 శాతం తగ్గగా, పట్టణ పేదల సంఖ్య 4.8 శాతం వరకు తగ్గింది. ఆహారంపై పట్టణ ప్రాంతాల్లోనైతే రోజుకు రూ.32, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.28.65 ఖర్చు పెట్టే వారిని పేదలుగా ప్రణాళికా సంఘం పేర్కొంది.

రైల్వే మంత్రిగా ముకుల్ రాయ్
కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా తృణమూల్ కాంగ్రెస్ నేత ముకుల్ రాయ్ మార్చి 20న ప్రమాణస్వీకారం చేశారు. రైల్వే చార్జీల పెంపును వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆదేశంతో రైల్వే శాఖ మంత్రి పదవికి దినేశ్ త్రివేదీ రాజీనామా చేశారు. దీంతో నౌకాయాన సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న ముకుల్ రాయ్‌ని రైల్వే మంత్రిగా మమత బెనర్జీ సిఫారసు చేశారు.

న్యూఢిల్లీలో ఆసియా సహజ వాయువు సదస్సు
ఆసియా సహజ వాయువు భాగస్వామ్య ఏడో సదస్సును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 23న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్యాస్ వినియోగాన్ని పెంచుతామని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గ్యాస్ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. 12వ ప్రణాళిక చివరి (2017) నాటికి దేశంలో 30,000 కి.మీ. గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మన్మోహన్ పేర్కొన్నారు. ఈ సదస్సును గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్), భారత వాణిజ్య సమాఖ్య(ఫిక్కీ), ఇంటర్నేషనల్ గ్యాస్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించాయి.

దేశంలో తొలి బ్రెయిలీ వార్తాపత్రిక
దేశంలో తొలి బ్రెయిలీ వార్తాపత్రిక ‘రిలయన్స్ దృష్టి’ని మార్చి 19న ముంబైలో ఆవిష్కరించారు. ఇది హిందీ భాషలో పక్షం రోజులకు ఒకసారి వెలువడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 142 నిర్మల్ గ్రామ్ పురస్కారాలు
పారిశుద్ధ్యంలో నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్న అత్యుత్తమ గ్రామ పంచాయతీలను కేంద్రం మార్చి 21న జాతీయ స్థాయి ‘నిర్మల్ గ్రామ్ పురస్కార్-2011’తో సత్కరించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 142 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాల వారీగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 95 గ్రామపంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి. ఖమ్మం (1), నల్లగొండ, కృష్ణా, రంగారెడ్డి (3), తూర్పు గోదావరి, గుంటూరు (5), కరీంనగర్, విశాఖపట్నం (7), మెదక్ (13) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రం తరపున పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి మాజీ సర్పంచి వై.చంటమ్మ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర 442, గుజరాత్ 422, మేఘాలయ 365, హర్యానా 330, హిమాచల్‌ప్రదేశ్ 323 గ్రామ పంచాయతీలు ఈ పురస్కారాలను అందుకున్నాయి.

హైదరాబాద్‌లో ఇండియా సాఫ్ట్ 2012
అంతర్జాతీయ ఐటీ ప్రదర్శన, సదస్సు ‘ఇండియా సాఫ్ట్ 2012’ హైదరాబాద్‌లో మార్చి 21 నుంచి 23 వరకు జరిగింది. ఇందులో 60కిపైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ జనాభా 5.63 కోట్లు
రాష్ట్రంలో పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా రెట్టింపు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5.63 కోట్ల మంది నివసిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 2.83 కోట్ల మంది నివాసం ఉంటున్నారు. జనాభా లెక్కల సేకరణ విభాగం జిల్లాల వారీగా గ్రామీణ, పట్టణ జనాభా లెక్కలను మార్చి 19న వెల్లడించింది. వివరాలు..గ్రామీణ జనాభాలో తూర్పుగోదావరి (36.36 లక్షలు), మహబూబ్ నగర్(34.45 లక్షలు) జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో రంగారెడ్డి (15.72 లక్షలు) జిల్లా ఉంది. హైదరాబాద్ పూర్తిగా పట్టణీకరణ చెందిన జిల్లా కావడంతో గ్రామీణ జనాభా లేదు. పట్టణ జనాభా అతి తక్కువ ఉన్న జిల్లా శ్రీకాకుళం (4.36 లక్షలు). రాష్ట్రంలో 10 లక్షల జనాభా దాటిన నగరాలు.. హైదరాబాద్ (77.49 లక్షలు), వైజాగ్ (17.30 లక్షలు), విజయవాడ (14.91 లక్షలు). లక్ష జనాభా దాటిన పట్టణాల సంఖ్య: 46. పట్టణ జనాభా లక్షకు మించి ఉన్న శాసన సభ నియోజకవర్గాల సంఖ్య 13. నిజామాబాద్, విజయనగరం, శ్రీకాకుళం, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. కానీ కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. 5.6 కోట్ల గ్రామీణ జనాభాలో 3 కోట్ల మంది అక్షరాస్యులు కాగా.. 2.8 కోట్ల మంది పట్టణ జనాభాలో 2 కోట్ల మంది అక్షరాస్యులు.

రైల్వే మంత్రి దినేష్ త్రివేది రాజీనామా
కేంద్ర రైల్వే మంత్రి దినేష్ త్రివేది మార్చి 18న తన పదవికి రాజీనామా చేశారు. రైల్వే బడ్జెట్ 2012-13లో రైలు చార్జీలు పెంచడాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వ్యతిరేకిస్తూ త్రివేది రాజీనామాను కోరారు. పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన త్రివేది సంకీర్ణ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు.

మణిపూర్ ముఖ్యమంత్రిగా ఇబోబి సింగ్
కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఓక్రామ్ ఇబోబి సింగ్ మణిపూర్ 23వ ముఖ్యమంత్రిగా మార్చి 14న ప్రమాణ స్వీకారం చేశారు. మణిపూర్ ముఖ్యమంత్రిగా సింగ్ ప్రమాణం చేయడం ఇది వరుసగా మూడోసారి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో 60 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది.

హైదరాబాద్‌లో విమాన మరమ్మతుల కేంద్రం ప్రారంభం
దేశంలో తొలి థర్డ్ పార్టీ విమాన నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్ మార్చి 13న ప్రారంభించారు. ఇక్కడ ప్రాంతీయ, అంతర్జాతీయ విమానాలకు నిర్వహణా సేవలు అందిస్తారు. దీన్ని రూ.350 కోట్లతో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్, మలేషియన్ ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. అజిత్‌సింగ్ మాట్లాడుతూ భారత విమానయాన పరిశ్రమ ప్రపంచంలో తొమ్మిదో అతిపెద్ద పరిశ్రమని, దీని నికర విలువ 2020 నాటికి 2000 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్‌లో బీడీఎల్ యూనిట్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అదనపు యూనిట్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సెరిగూడ గ్రామంలో మార్చి 18న శంకుస్థాపన చేశారు. ఈ కేంద్రంలో భూతలం నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణులు తయారు చేస్తారు. రూ. 500 కోట్లతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీడీఎల్‌కు హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు యూనిట్లు ఉన్నాయి.

సీఆర్‌ఆర్‌ను తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వ్ బ్యాంక్ మార్చి 8న నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)ను 0.75 శాతం తగ్గించింది. దీంతో 5.5 శాతంగా ఉన్న సీఆర్‌ఆర్ 4.75 శాతానికి తగ్గింది. బ్యాంకు తన మొత్తం డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిధుల నిష్పత్తి పరిమాణం (సీఆర్‌ఆర్) ను తగ్గించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలోకి *48,000 కోట్లు వస్తాయి. ద్రవ్య లభ్యతపై ఒత్తిడి తగ్గుతుంది.

గోవా ముఖ్యమంత్రిగా పారికర్
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన మనోహర్ పారికర్ మార్చి 8న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడోసారి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పారికర్ మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. 40 స్థానాలున్న శాసనసభలో బీజేపీకి 21, మహారాష్ట్ర గోమంతిక్ పార్టీ 3 స్థానాలు గెల్చుకుని అధికారంలోకి వచ్చాయి.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఎం.పి. విజయ్ బహుగుణను కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది. మార్చి 13న ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ బహుగుణ తేహ్రీ గార్వల్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన బహుగుణ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందన్ బహుగుణ కుమారుడు. విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్‌కు ఆరో ముఖ్యమంత్రి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ (38) ఎంపికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) శాసనసభా పక్షం అఖిలేష్‌ను తమ నాయకుడిగా మార్చి 10న ఎన్నుకుంది. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌కు అతి పిన్నవయస్కుడైన ముఖ్యమంత్రి. 1995లో మాయావతి 39 ఏళ్ల వయసులో యూపీ ముఖ్యమంత్రి అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ కుమారుడైన అఖిలేష్ యాదవ్ మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తొలిసారి 2000లో కనౌజ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్
పంజాబ్ ముఖ్యమంత్రిగా శిరోమణి అకాళీదల్‌కు చెందిన ప్రకాష్ సింగ్ బాదల్ ఐదోసారి మార్చి 14న ప్రమాణస్వీకారం చేశారు. వరుసగా రెండోసారి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ పార్టీలు అధికారంలోకి రావడంతో బాదల్ మరోసారి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. శాసనసభలోని 117 స్థానాల్లో ఎస్‌ఏడీ, బీజేపీలకు 62 స్థానాలు, కాంగ్రెస్‌కు 45 స్థానాలు దక్కాయి.
నేషనల్ టూరిజం అవార్డులు
2010-11కు జాతీయ పర్యాటక అవార్డులను రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ ఫిబ్రవరి 29న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ర్ట, కేంద్రపాలిత ప్రభుత్వాలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కనబర్చే ఉత్తమ పనితీరుకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా ఈ అవార్డులు అందజేస్తోంది.

ఉత్తమ హెరిటేజ్ నగరం: హైదరాబాద్
ఉత్తమ ఎయిర్‌పోర్‌‌ట: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)
ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్ట్
బెస్ట్ డొమెస్టిక్ ఆపరేటర్: సదరన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (వరుసగా ఐదోసారి ఈ అవార్డు పొందింది)
ఇన్నోవేటివ్, యునిక్ టూరిజం ప్రాజెక్ట్ అవార్డు: సిక్కిం (సోలోపోక్‌లో ప్రపంచస్థాయి టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి)
సమగ్ర పర్యాటక రంగం అభివృద్ధికి ఇచ్చే బెస్ట్ స్టేట్ అవార్డు: సిక్కిం
క్లీన్ ఇండియా ప్రచారానికి బెస్ట్ స్టేట్: సిక్కిం

బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం
రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో మార్చి 4న జరిపిన సూపర్ సోనిక్ క్షిపణి ‘బ్రహ్మోస్’ పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే బ్రహ్మోస్ 290 కి.మీ. నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది. ఇది 2.8 మాక్ లేదా దాదాపు శబ్దవేగం కంటే మూడింతలు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. 300 కిలోల బరువు ఉన్న సంప్రదాయ ఆయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2007 జూన్‌లో భారత సైన్యంలో చేర్చారు. ఈ పరీక్షతో సైన్యం రెండో బ్రహ్మోస్ ఆపరేషన్‌లో రెజిమెంట్‌ను ప్రారంభించింది. త్వరలో అరుణాచల్‌ప్రదేశ్‌లో మూడో బ్రహ్మోస్ యూని ట్ ప్రారంభం కానుంది. ఒక్కో ఆపరేషన్ యూనిట్‌లో 65 క్షిపణి వ్యవస్థలుంటాయి. బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. దీన్ని బ్రహ్మపుత్ర, మోస్కోవా నదుల పేర్లు కలిపి భారత్, రష్యాలు సంయుక్తంగా నిర్మించాయి.

కొత్త ఆర్మీ చీఫ్‌గా బిక్రమ్ సింగ్
సైనిక దళాల కొత్త అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మార్చి 3న ప్రకటించింది. మే 31న పదవి విరమణ చేస్తున్న ఆర్మీ చీఫ్ వి.కె.సింగ్ స్థానంలో బిక్రమ్‌సింగ్ నియమితులయ్యారు. 2014 ఆగస్టు వరకూ బిక్రమ్‌సింగ్ పదవిలో కొనసాగుతారు.

ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ స్వర్ణోత్సవాలు
ఆఫ్రో - ఆసియన్ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఏఏఆర్‌డీఓ) స్వర్ణోత్సవాలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మార్చి 5న న్యూఢిల్లీలో ప్రారంభించారు. రెండు ఖండాల్లో సుస్థిరాభివృద్ధి సాధించాలంటే గ్రామీణ పునర్ నిర్మాణం, పేదరికం నిర్మూలన మౌలిక అంశాలని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోని పేదవారిలో ముప్పాతిక వంతు ఆసియా, ఆఫ్రికాలో జీవిస్తున్నారని పేర్కొన్నారు. వాతావరణ మార్పు చర్చల్లో, రియో 20 సదస్సులో ఉత్తమ ఫలితాల కోసం ఆఫ్రో, ఆసియన్ దేశాలు కలిసి పని చేయాలని ప్రధాని కోరారు. ఈ సంస్థలో 15 ఆఫ్రికన్ దేశాలు, 14 ఆసియా దేశాలు ఉన్నాయి.

ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూకంపం
మార్చి 5న న్యూఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైంది. ఢిల్లీ - హర్యానా సరిహద్దులోని బహదూర్‌గఢ్ భూకంప కేంద్రంగా ఈ ప్రకంపనలు ఏర్పడ్డాయి. దేశంలో ఈ ఏడాది సంభవించిన భూకంపాల్లో ఇది 19వది. జనవరిలో 10 సార్లు, ఫిబ్రవరిలో ఆరు సార్లు భూకంపాలు సంభవించాయి. భారత్‌లో 2011లో 80 భూకంపాలు సంభవించాయి. అవి 5.0 నుంచి 3.6 వరకు రిక్టర్ స్కేలుపై నమోదయ్యాయి. ఈ భూకంపాలు ఉత్తర భారతదేశంలోని జమ్మూకాశ్మీర్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో సంభవించాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ప్రకారం దేశంలో తీవ్ర ప్రభావమున్న భూకంప జోన్ నాలుగులో 30 నగరాల్లో ఢిల్లీ కూడా ఉంది.

ఆరోగ్య రక్షణకు జీడీపీలో 2.5 శాతానికి ప్రభుత్వ రంగం
ఆరోగ్య రక్షణకు 12వ పంచవర్ష ప్రణాళికలో నిధులు పెంచాలని ప్రణాళిక సంఘాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ వ్యయాన్ని వచ్చే ఐదేళ్లలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.5 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇది 1.4 శాతంగా ఉంది. యూనివర్సల్ హెల్త్‌కేర్‌పై నియమించిన శ్రీనాథ్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ సిఫారసుల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో జీడీపీలో ఆరోగ్యంపై భారత్ అతి తక్కువ వ్యయం చేస్తోంది. శ్రీలంక 1.8 శాతం, చైనా 2.3 శాతం, థాయ్‌లాండ్ 3.3 శాతం, అమెరికా 7 శాతం, యు.కె., స్పెయిన్, జర్మనీ, ఇటలీ దేశాలు 6.5 నుంచి 8 శాతం వ్యయం చేస్తున్నాయి.

‘కొటాల’ గ్రామానికి కేంద్ర ప్రభుత్వ అవార్డు
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ‘కొటాల’ గ్రామ పంచాయితీకి కేంద్ర ప్రభుత్వ ‘గ్రామరత్న’ అవార్డు లభించింది. ఈ అవార్డును ఫిబ్రవరి 29న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి ‘కొటాల’ను సందర్శించి ప్రదానం చేశారు. ‘భారత్ నిర్మాణ్’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అభివృద్ధిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు ఈ అవార్డు దక్కింది.

ఏపీలో 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్
ఒకేసారి 16 మంది శాసనసభ సభ్యులను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ మార్చి 2న అనర్హులుగా ప్రకటించారు. మరో సభ్యురాలి రాజీనామాను ఆమోదించారు. వీరంతా వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారు.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ పేరా 2 (1) (బి) కింద వారిని అనర్హుల్ని చేశారు. 2011 డిసెంబర్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేయడంతో వారు ఈ సభ్యులు సభ్యత్వం కోల్పోయారు. దీంతో 294 మంది సభ్యులు ఉన్న సభలో కాంగ్రెస్ బలం 137కు పడిపోయింది. పార్టీ ఫిరాయింపుల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా అత్యధిక సంఖ్యలో అనర్హతకు గురయ్యారు. ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్‌లో 13 మంది బీఎస్పీ సభ్యులు అనర్హతకు గురయ్యారు.

ఎన్నికలు

యూపీ పీఠంపై ములాయం
ఐదు రాష్ట్రాల శాసన సభలకు నిర్వహించిన ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) విజ యం సాధించింది. మొత్తం 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఎస్‌పీ 225 సీట్లు గెలుచుకుంది. మాయావతి నేతృత్వంలోని అధికార బహుజన్ సమాజ్ పార్టీకి 79 సీట్లు మాత్రమే దక్కాయి. బీజేపీకి 47 రాగా, కాంగ్రెస్ తన మిత్రపక్షం ఆర్‌జేడీతో కలిసి 38 స్థానాల్లో విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

పంజాబ్‌లో మళ్లీ అకాలీదళ్
అకాలీదళ్, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పంజాబ్‌లో తిరిగి గెలుపొందింది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో అధికార అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీ మిత్ర పక్షాలు 68 స్థానాలతో అధికారం నిలుపు కున్నాయి. ఇందులో ఎస్‌ఏడీ 56, బీజేపీకి 12 సీట్లు వచ్చాయి. 46 సీట్లతో కాంగ్రెస్ మరో సారి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. 46 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఒకే కూటమికి వరుసగా రెండోసారి పట్టం కట్టడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ లంబి స్థానం నుంచి గెలుపొందారు.

గోవాలో బీజేపీ జయకేతనం
గోవా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ, ఎంజీపీ కూటమి 24 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మనోహర్ పారికర్ పనాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

మణిపూర్‌లో కాంగ్రెస్
ఈశాన్య రాష్ర్టమైన మణిపూర్‌లో కాంగ్రెస్ మరోసారి విజయభావుటా ఎగురవేసింది. 60 స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 42 స్థానా లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. తృణముల్ కాంగ్రెస్ 7, ఎన్‌పీఎఫ్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ముఖ్యమంత్రి ఒ.ఇబోబిసింగ్ తౌ బాల్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు.

ఉత్తరాఖండ్‌లో...
70 సీట్లున్న ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు 32 బీజేపీకి 31, ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించలేక పోయాయి. బీసీ ఖండూరి కోట్ ద్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Total Pageviews

1067548

Template Information

Template Information