October - 2012

కేంద్రమంత్రి వర్గ విస్తరణ
కేంద్ర మంత్రివర్గాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్టోబర్ 28న విస్తరించారు. ఇందులో రాష్ర్టం నుంచి కొత్తగా ఐదుగురికి.. చిరంజీవి (పర్యాటకశాఖ), కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (రైల్వే), సర్వే సత్యనారాయణ (రోడ్డు రవాణా, హైవేలు), బలరామ్ నాయక్ (సామాజిక న్యాయం), కిల్లి కృపారాణి (టెలికాం, ఐటీ) చోటు దక్కింది. దీంతో కేబినెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిథ్యం 10కి చేరింది (గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్‌ను లెక్కిస్తే మొత్తం మంత్రుల సంఖ్య 11 అవుతుంది. దీంతో కేంద్రంలో అత్యధిక మంత్రులు గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది). నూతన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సల్మాన్ ఖుర్షీద్ నియమితులయ్యారు. పవన్ కుమార్ బన్సాల్‌ను రైల్వే శాఖకు మార్చారు. 17 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌కు రైల్వే శాఖ దక్కింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏడుగురు మంత్రులు రాజీనామాలు చేశారు. కాగా 22 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య 81 వరకు ఉండొచ్చు.

ల‌క్ష కోట్లతో జేఎన్ఎన్ యూఆర్ఎం-2
జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ప‌ట్టణ న‌వీక‌ర‌ణ (జేఎన్ఎన్ యూఆర్ఎం) రెండో విడత ప‌థ‌కానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. ల‌క్షకోట్లతో 2013 జ‌న‌వ‌రి నుంచి ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్నారు.

స‌న్ టీవి నెట్‌వ‌ర్క్ కు హైద‌రాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ
హైద‌రాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని త‌మిళ‌నాడుకి చెందిన స‌న్‌టీవి నెట్ వ‌ర్క్ సొంతం చేసుకుంది. డెక్కన్ ఛార్జర్స్ ఫ్రాంచైజీ ర‌ద్దవ‌డంతో కొత్త ఫ్రాంచైజీ కోసం బీసీసీఐ బిడ్ ల‌ని ఆహ్వానించింది. స‌న్‌టీవితో పాటు, పీవీపీ వెంచ‌ర్స్ బిడ్ లు దాఖ‌లు చేసాయి. అత్యధికంగా ఆయిదేళ్ల ఒప్పందానికి ఏడాదికి రూ. 85.05 కోట్లతో బిడ్ కోట్ చేసిన‌ స‌న్‌టీవీ నెట్ వ‌ర్క్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.

అణు సహకారంపై అంగీకారం
అణు సహకారంపై చర్యలు ప్రారంభించేందుకు ఆస్ట్రేలియా- భారత్ అంగీకరించాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి జూలియా గిలార్డ్ భారత పర్యటనలో భాగంగా అక్టోబర్ 17న భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. భద్రత, రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాల్లో సహకారం విస్తరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా ప్రకటించారు. విద్యార్థుల పర్యటన, సంక్షేమం, నైపుణ్యం, అభివృద్ధి, జౌళి, అంతరిక్ష రంగాల్లో సహకారానికి సంబంధించి నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ప్రతి సంవత్సరం ఉన్నతస్థాయి చర్చలు జరిపేందుకు కూడా ఇరుపక్షాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక పౌర అణు సహకారానికి రెండు దేశాలు సుముఖంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని గిలార్డ్ తెలిపారు. గిలార్డ్ భారత రాష్ట్రపతితో కూడా సమావేశమై ద్వైపాక్షిక ప్రాముఖ్యత గల అంశాలపై చర్చలు జరిపారు.

సంపన్న నగరాల్లో ముంబై, ఢిల్లీ
ప్రపంచంలో సంపన్న నగరాలుగా అభివృద్ధి చెందుతున్న 95 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీలకు చోటుదక్కింది. ముంబై 52వ స్థానంలో, ఢిల్లీ 58వ స్థానంలో నిలిచినట్లు ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ సిటీస్’ పేరుతో ఐక్యరాజ్యసమితికి చెందిన ‘యూఎన్ హాబిటాట్’ అక్టోబర్ 17న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా తొలి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూయార్క్, టొరంటో, లండన్, స్టాక్‌హోమ్ ఉన్నాయి. కాగా, ఐటీ విప్లవం సాధించిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని యూఎన్ హాబిటాట్ ప్రత్యేకంగా అభినందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ దేశ ఫార్మసీ రాజధానిగా మారిందంటూ కితాబిచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాలు సంపన్నతతో కూడిన అభివృద్ధి సాధించాలంటే తమ ప్రాధాన్యతలను మార్చుకోవాలని పేర్కొంది.

ఆధార్ ఆధారిత సేవలు ప్రారంభం
ఆధార్ కార్డు అనుసంధానిత సేవలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీలు అక్టోబర్ 20న రాజస్థాన్‌లోని దూదూలో ప్రారంభించారు. ఆధార్ కార్డులు ప్రవేశపెట్టి.. రెండేళ్లు అయిన సందర్భంగా ఈ సేవలు ప్రారంభించి, 21వ కోటి ఆధార్ కార్డును కూడా ఈ సందర్భంగా అందజేశారు.

ముగిసిన జీవ వైవిధ్య సదస్సు
జీవ వైవిద్య పరిరక్షణ కోసం నిధుల సమీకరణపై కార్యాచరణ ప్రణాళికను అంగీకరిస్తూ ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య సదస్సు అక్టోబర్ 19న హైదరాబాద్‌లో ముగిసింది. జంతు, పక్షి జాతుల పరిరక్షణకు 2015 నాటికి రెండింతలు నిధులు అందించేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. దాంతో జీవ వైవిధ్య పరిరక్షణకు 12 బిలియన్ డాలర్లు నిధులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు ఇవి 6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత్ తన వంతుగా 50 మిలియన్ డాలర్లు సమకూరుస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్టోబర్ 16న ప్రకటించారు. ఈ సందర్భంగా నగోయా(జపాన్) సదస్సులో నిర్ణయించిన 20 లక్ష్యాలను సాధించడానికి అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. జీవ వైవిధ్య సదస్సులను 2020 వరకు ప్రతి రెండేళ్ల కొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. వాతావరణ మార్పులు -జీవవైవిధ్యం, నీటి వనరుల పరిరక్షణ, ద్వీపాలు,, సముద్ర తీరప్రాంత వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ, లింగ వివక్షత, స్థానికుల భాగస్వామ్యం, పేదరిక నిర్మూలన, అభివృద్ధి త దితర అంశాలను సదస్సు ఆమోదించింది. తర్వాత 2014లో జీవవైవిధ్య సదస్సును రిపబ్లిక్ ఆఫ్ కొరియా నిర్వహిస్తుంది.

పార్లమెంట్ మహిళా స్పీకర్ల సమావేశం
పార్లమెంట్ మహిళా స్పీకర్ల ఏడో సమావేశం న్యూఢిల్లీలో అక్టోబర్ 4న ముగిసింది. పార్లమెంట్, ఇతర నామినేటెడ్ సంస్థల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు ప్రోత్సహించాలని సదస్సు పిలుపునిచ్చింది. రెండు రోజులు జరిగిన సమావేశంలో పలు దేశాల మహిళా స్పీకర్లు పాల్గొన్నారు. ప్రపంచంలోని 190 పార్లమెంటుల్లో 37 మంది మాత్రమే మహిళా స్పీకర్లున్నారు. ఈ సమావేశాన్ని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, ఇండియన్ పార్లమెంట్ నిర్వహించాయి.

వాణిజ్య సహకార ఒప్పందం
ఉమ్మడి ప్రయోజనాలకు ఉద్దేశించిన ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్, వాషింగ్టన్ రాష్ట్రాలు సంతకాలు చేశాయి. వాషింగ్టన్ గవర్నర్ క్రిష్టినే గ్రెగోరీ నాయకత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన ట్రేడ్ మిషన్ కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై అక్టోబర్ 3న హైదరాబాద్‌లో గవర్నర్ గ్రెగోరీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు చేశారు. వాణిజ్య, సాంస్కృతిక రంగాలు ఐటీ, బీటీ, నైపుణ్య అభివృద్ధి, వ్యవసాయం, తోటల పెంపకం, క్లీన్ ఎనర్జీ, ఆరోగ్యం, పారిశుద్ధ్యం రంగాల్లో రెండు రాష్ట్రాలు సహకరించుకుంటాయి.
సౌర ఇంధన విధానం 2012
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2012 సౌర ఇంధన విధానాన్ని సెప్టెంబర్ 26న ప్రకటించింది. ఈ విధానం ప్రకారం 2014 జూన్ నాటికి సౌర విద్యుత్ కేంద్రాలను ప్రారంభించిన వారందరికీ ఏడేళ్లపాటు ప్రోత్సాహకాలు అందుతాయి. వీలింగ్, ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఉండవు.

ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు
ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు - 11వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సీఓపీ) హైదరాబాద్‌లో అక్టోబర్ 1 న ప్రారంభమైంది. అక్టోబర్ 19వ తేదీ వరకు జరుగుతుంది. తొలిరోజు జీవ భద్రతపై కార్టేజెనా ఒప్పందం అమలుపై చర్చించారు. జీవ భద్రతపై 2003 సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిన కార్టేజెనా ఒప్పందం, తదుపరి తీర్మానాలు, వాటి అమలు తదితర అంశాలపై అక్టోబర్ 1 నుంచి ఐదు రోజులపాటు చర్చలు జరుగుతాయి. జీవ భద్రతపై ఇది ఆరోసదస్సు. ఈ జీవవైవిధ్య సదస్సులో 193 దేశాల నుంచి 9000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. గతంలో ఈ సదస్సు 2010లో జపాన్‌లోని నగోయాలో జరిగింది. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ఐక్యరాజ్యసమితి 1992లో బ్రెజిల్‌లోని రియోడిజెనీరోలో ఇచ్చిన పిలుపు మేరకు ఈ సదస్సులు జరుగుతున్నాయి.

స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్
విద్యుత్ పొదుపు, సమర్థవంత వినియోగం కోసం ‘స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్’ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇంధన శాఖ సెప్టెంబర్ 26న ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు.

Total Pageviews

Template Information

Template Information