September - 2012

బుద్ధిస్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన
మధ్యప్రదేశ్‌లోని సాంచీలో ‘సాంచీ యూనివర్సిటీ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ ఇండిక్ స్టడీస్’కు శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే సెప్టెంబర్ 21న శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాన మంత్రి జిగ్మే వై. థిన్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

గగనతల నియంత్రణ హెచ్చరిక వ్యవస్థ
గగనతల నియంత్రణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (ఏఈడబ్ల్యూ అండ్ సీ) ను భారత వైమానిక దళ అధిపతి ఎన్.ఎ.కె. బ్రౌనే సెప్టెంబర్ 20న లాంఛనంగా ఆవిష్కరించారు. బ్రెజిల్ తయారు చేసిన విమానానికి ఏఈడబ్ల్యూ అండ్ సీ వ్యవస్థను అనుసంధానం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ 2014 నాటికి వినియోగంలోకి వస్తుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ అత్యంత ఆధునికమైంది. దీంతో సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నిఘా వ్యవస్థలు కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరింది

నూతన ఐటీ విధానం
నూతన ‘జాతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విధానం-2012’కు కేంద్రం సెప్టెంబర్ 20న ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ద్వారా దేశ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లను అధిగమించాలని ఈ విధానంలో నిర్ణయించారు. ఐసీటీ శక్తిని వినియోగించడం ద్వారా జీవన ప్రమాణాలను మార్చాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం 2020 నాటికి కోటి మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తారు. 100 బిలియన్ డాలర్లు ఉన్న ఐటీ మార్కెట్‌ను 300 బిలియన్ డాలర్ల మేర అభివృద్ధి చేయడానికి ఈ విధానం తోడ్పడుతుంది. ప్రస్తుతం 69 బిలియన్ డాలర్లు ఉన్న ఎగుమతులు 2020 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. నూతన విధానం ప్రకారం ప్రతి కుటుంబంలో ఒకరిని ఇ-అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతుంది.

మద్దతు ఉపసంహరించిన తృణమూల్
కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. డీజిల్ ధరల పెంపు, సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం, రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐలకు అనుమతి వంటి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సెప్టెంబర్ 18న ప్రకటించింది. అంతేకాకుండా ఆ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రు లు సెప్టెంబర్ 21న తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య 19. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో యూపీఏ కూటమి బలం 270 నుంచి 251కి తగ్గింది.

పాలస్తీనా అధ్యక్షుడి భారత్ పర్యటన
పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా అబ్బాస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సెప్టెంబర్ 11న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో సభ్యేతర దేశం హోదాకు పాలస్తీనా చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా భారత్ 10 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కూడా పాలస్తీనాకు ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోసహా మరోరెండు అంశాలపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుతం ఉన్న పరిశీలక హోదా నుంచి ఉన్నత స్థానాన్ని పాలస్తీనా కోరుకుంటుంది.

ఏపీ నూతన భూకేటాయింపు విధానం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భూ కేటాయింపు విధానాన్ని అమల్లోకి తెస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, విద్య, మత ఛారిటబుల్, స్వచ్ఛంద, ఇతర ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కొత్త విధానాలను ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజా ప్రయోజనాలకు మాత్రమే భూములు కేటాయిస్తారు. వనరుల సేకరణ కోసం భూ అమ్మకాలపై నిషేధం విధించారు. మెట్ట, బీడు భూములను మాత్రమే పారిశ్రామిక అవసరాల కోసం కేటాయిస్తారు. చిన్న పట్టణాలు, మండల ప్రధాన కేంద్రాలకు 2 కి.మీ పరిధిలో భూ కేటాయింపులు ఉండవు. పరిశ్రమలకు అనుమతి నివ్వరు. కేటాయింపులో పర్యావరణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. స్థానిక సంస్థలు, నగరాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ భూ నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి భూపరిపాలన శాఖ ఛీఫ్ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో 8 మంది సభ్యులుంటారు. ఈ అథారిటీ ఆన్‌లైన్ ల్యాండ్ బ్యాంక్‌ను నిర్వహిస్తుంది. ప్రభుత్వ భూములకు సంబంధించి సమగ్ర సమాచారం కలిగి ఉంటుంది.

పీఎస్‌ఎల్‌వీ -సి 21 విజయవంతం
పోలార్ శాటిలైట్ లాంచ్ వెిహ కల్(పీఎస్‌ఎల్‌వీ)-సి 21 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 9న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో 100 ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇందులో 62 ఉప గ్రహాలు, 37 రాకెట్లు, ఒక స్పేస్ క్యాప్సూల్ ఉన్నాయి. పీఎస్‌ఎల్‌వీ- సి 21 ద్వారా మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఈ మూడింటిలో ఫ్రాన్స్‌కు చెందిన ‘స్పాట్-6’, జపాన్‌కు చెందిన ‘ప్రొయిటెరస్’, భారత్‌కు చెందిన ‘మినీ రెడిస్’ ఉన్నాయి. భూమికి 655 కిలోమీటర్ల ఎత్తులో 98.23 డిగ్రీల వాలుతో సూర్యానువర్తన ధ్రువ కక్ష్య(సన్ సిక్రోనస్ ఆర్బిట్)లో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. స్పాట్-6 కోసం ఫ్రాన్స్‌రూ.100 కోట్లు చెల్లిస్తుంది. ఈ ప్రయోగాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యక్షంగా వీక్షించారు.
స్పాట్-6: ఫ్రాన్స్‌కు చెందిన ఆస్ట్రియం కంపెనీ రూపొందించింది. 715 కిలోల బరువుగల స్పాట్-6 భూ పరిశీలన కోసం చిత్రాలను తీస్తుంది. ఏడేళ్ల పాటు పనిచేస్తుంది.
ప్రొయిటెరస్: 15 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని జపాన్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు రూపొందించారు. జపాన్‌లోని కాన్యాయి జిల్లా చిత్రాలను తీసి పంపుతుంది. విద్యుత్ థ్రస్టర్లు వినియోగంపై అధ్యయనానికి ఉపయోగపడుతుంది.
మినీ రెడిస్: నావిగేషన్ విధానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు 50 కిలోల ఈ పేలోడ్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది.
ప్రాదేశిక సైన్యంలో సచిన్ పైలట్
కేంద్ర కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సచిన్ పైలట్ (35) ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో సెప్టెంబర్ 6న అధికారిగా చేరారు. టెరిటోరియల్ ఆర్మీలో రెగ్యులర్ అధికారిగా చేరిన తొలి కేంద్ర మంత్రిగా సచిన్ రికార్డు సృష్టించారు. సిక్ రెజిమెంట్ కు చెందిన 124 టి.ఎ బెటాలియన్‌లో అధికారిగా చేరారు. ఇందుకోసం ఆయన ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డు, సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మెడికల్ పరీక్షలను కూడా పూర్తి చేసుకున్నారు. టెరిటోరియల్ ఆర్మీలో ఆయన శిక్షణ పూర్తి చేయాల్సి ఉంది. రాజస్థాన్‌లోని దేసా నియోజకవర్గం నుంచి సచిన్ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్రికెటర్లు క పిల్‌దేవ్, ఎం.ఎస్. ధోని, నటుడు మోహన్‌లాల్ ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్స్‌గా చేరారు.
భారత్ చేరిన డ్రీమ్ లైనర్
అత్యంత ఆధునిక ప్రయాణికుల రవాణా విమానం ‘బోయింగ్ 787 డ్రీమ్ లైనర్’ సెప్టెంబర్ 8న భారత్ చేరింది. అమెరికాలోని దక్షిణ కరోలినాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి 15 గంటల్లో న్యూఢిల్లీ చేరింది. 2008 నాటికి అందేలా మొత్తం 27 డ్రీమ్ లైనర్ల కొనుగోలుకు బోయింగ్‌తో ఎయిర్ ఇండియా ఒప్పందం చేసుకోగా తొలి విమానం సెప్టెంబర్ 8న చేరింది. ఎలాంటి విరామం లేకుండా 16,000 కి.మీ. ప్రయాణించడం డ్రీమ్ లైనర్ ప్రత్యేకత. 210 నుంచి 290 మంది వరకు ప్రయాణించొచ్చు. విమాన తయారీలో అల్యూమినియం బదులు కర్బన మిశ్రమ లోహాన్ని వినియోగించడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఇంధన సామర్థ్యం 20 శాతం పెరుగుతుంది.
భారత్-పాక్ వీసా నిబంధనల ఒప్పందం
కొత్త వీసా నిబంధనలకు సంబంధించి భారత్, పాకిస్థాన్‌లు సెప్టెంబర్ 8న సంతకాలు చేసాయి. పాకిస్థాన్ పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.ఎం. కృష్ణ, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రెహ్మాన్ మాలిక్‌లు వీసా ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో వీసా జారీ చేయడం, పర్యాటకులకు, యాత్రికులకు గ్రూప్ వీసాలు, వ్యాపారవేత్తలకు ప్రత్యేక వీసాల జారీ, వృద్ధులకు చెక్‌పోస్టుల వద్ద సత్వరం వీసా మంజూరు చేయడం ప్రధానాంశాలు. సాంస్కృతిక మార్పిడుల ఒప్పందంపైనా ఇరు దేశాలు సంతకాలు చేసాయి. పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖర్‌తో ఉగ్రవాదం, జమ్ము కాశ్మీర్, సియాచిన్ వంటి ద్వైపాక్షిక అంశాలపై కూడా కృష్ణ చర్చలు జరిపారు.
వర్గీస్ కురియన్ మృతి
క్షీర విప్లవ పితామహుడు, పాల ఉత్పత్తిలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన పద్మవిభూషణ్ వర్గీస్ కురియన్(90) గుజరాత్‌లోని నాడియాద్‌లో సెప్టెంబర్ 9న మరణించారు. 1921లో కేరళలో జన్మించిన కురియన్ 1949లో గుజరాత్ చేరుకున్నారు. ఆనంద్ డైరీలో పనిచేస్తూ పాడి రంగంలో స్థానిక రైతుల సమస్యలను పరిష్కరించారు. పాడి పరిశ్రమ విభాగంలో తొలిసారి సహకార వ్యవస్థలకు ఆవిష్కరణ చేశారు. అంతేకాక తొలిసారి గేదె పాలతో పాల పొడిని తయారు చేసిన ఘనత సాధించారు. అప్పటి వరకు ఆవు పాలతో పాల పొడి తయారు చేసేవారు. అమూల్ డైరీని అభివృద్ధి చేశారు. రూ. 13,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో అమూల్ ఆసియాలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. పాడి పరిశ్రమ విభాగంలో ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగానే 1960లో రెండు కోట్ల మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2011 నాటికి 12.2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ ంలో పాల ఉత్పత్తిలో 17 శాతం భారత్‌లో జరుగుతుంది. నాటి ప్రధాని నెహ్రూ జాతీయ పాడి అభివృద్ధి మండలిని స్థాపించి కురియన్‌ను చెర్మన్‌గా నియమించారు. 1965లో పద్మశ్రీ, 1966 పద్మ భూషణ్, 1999లో పద్మ విభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతోపాటు ఆసియా నోబెల్‌గా పిలిచే రామన్ మెగసెసె పురస్కారాన్ని కూడా కురియన్ అందుకున్నారు.
అణు శాస్త్రవేత్త రోహిణీ ప్రసాద్ మృతి
రచయిత, అణు శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణి ప్రసాద్ (63) సెప్టెంబర్ 8న ముంబైలో మరణించారు. ఈయన ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్)లో అణు శాస్త్రవేత్తగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో పని చేశారు. విశ్వాంతరాళం, జీవ విజ్ఞానం- సమాజం, మానవ పరిణామం, అణువులు దేవుడు చేసిన మనుషులు వంటి అత్యంత ఆదరణ పొందిన సైన్స్ పుస్తకాలు రాసారు. ఈయన ప్రముఖ రచయిత కొడవగంటి కుటుంబరావు కుమారుడు.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతమే
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెప్టెంబర్ 4న పేర్కొంది. ఈ రిజర్వేషన్లు 60.5 శాతం కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది. 50 శాతానికి పరిమితమై ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ జీవో ప్రకారం బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లున్నాయి. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించి బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది.
 
తీర గస్తీ నౌక రాజ్ కిరణ్ ప్రారంభం
భారత తీర భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన తీర గస్తీ నౌక ‘రాజ్‌కిరణ్’ను ఆగస్టు 29న విశాఖపట్నం కోస్ట్ గార్డ్ జెట్టీ నౌక దళానికి అప్పగించారు. అత్యాధునిక కమ్యూనికేషన్, నావిగేషనల్ వ్యవస్థలు ఈ నౌకలో ఉన్నాయి. 35 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. నిఘా, ఆపద నుంచి కాపాడటం, రక్షణ, వైద్యం వంటి పలు రకాలైన విధులను ఇది నిర్వహిస్తుంది. హాల్దియా కేంద్రంగా ఇది పనిచేస్తుంది.
నౌకా దళాధిపతిగా డి.కె. జోషి
నౌకా దళాధిపతిగా అడ్మిరల్ దేవేందర్ కుమార్ జోషి ఆగస్టు 31న బాధ్యతలు స్వీకరించారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ స్పెషలిస్టుగా జోషి గుర్తింపు పొందారు. పదవీ విరమణ చేసిన నిర్మల్ వర్మ స్థానంలో జోషి నియమితులయ్యారు.
రాష్ట్రానికి అక్షరాస్యత మిషన్ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లిటరసీ మిషన్ అథారిటీకి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో ఈ పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు సాక్షర్ భారత్ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జిల్లాస్థాయిలో విజయనగరం, పంచాయతీ కేటగిరీలో అనంతపురం జిల్లాలోని పి. యేలేరు గ్రామం అవార్డులు పొందాయి. అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధిలో కృషి చేస్తున్న సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను నేషనల్ లిటరసీ మిషన్ అథారిటీ ఏర్పాటు చేసింది.
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా బ్రౌనే
చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీఓఎన్‌సీ) చైర్మన్‌గా వైమానిక దళాధిపతి మార్షల్ ఎన్.ఎ.కె. బ్రౌనే సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించారు. మూడు దళాల అధిపతుల్లో అత్యంత సీనియర్ అయిన బ్రౌనే అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో నియమితులయ్యారు. మూడు దళాలకు సంబంధించిన విధాన పరమైన నిర్ణయాల్లో సీఓఎన్‌సీ సమన్వయాన్ని చేకూరుస్తుంది.
లైంగిక వేధింపుల నియంత్రణ బిల్లు
పార్లమెంటులో రెండు కీలకమైన బిల్లులు సెప్టెంబర్ 3న ఆమోదం పొందాయి. పని ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించే బిల్లు, జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థను విస్తరించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు కూడా ఆమోదం పొందాయి. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల (నియంత్రణ, నిషేధ, పరిష్కార) బిల్లు-2010ను మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ తీర్‌‌థ ప్రవేశపెట్టగా, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం ఇళ్లలో పనిచేసే పనిమనుషులతోసహా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారికి రూ.50వేల వరకు జరిమానా పడుతుంది.
బాలకార్మిక నిరోధ చట్టానికి సవరణ
దేశంలో ఇప్పటివరకూ 14 ఏళ్లలోపు చిన్నారులను ప్రమాదకర పనుల్లో పెట్టుకోవడంపై నిషేధం కొనసాగుతుండగా తాజాగా ప్రమాదరహిత పనుల్లో పెట్టుకోవడంపైనా నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆగస్ట్ 28న ఆమోదించింది. ఈ మేరకు బాలకార్మిక నిరోధక, నియంత్రణ చట్టంలో సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిం ది. దీని ప్రకారం 14 ఏళ్లలోపు చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం శిక్షార్హమైన నేరం.
ఇందుకు గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు లేదా నిర్దేశించిన విధంగా జరిమానా పడుతుంది. మరోవైపు 18 ఏళ్లలోపు చిన్నారులను మైనింగ్ వంటి ప్రమాదకర పరిశ్రమల్లో బాలకార్మికులుగా పెట్టుకోవడంపైనా పూర్తిస్థాయి నిషేధం విధించాలన్న ప్రతిపాదనకు కూడా సర్కారు ఆమోదముద్ర వేసింది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1.26 కోట్ల మంది బాలకార్మికులున్నారు. 2009 ఆగస్టు 4న ఆమోదం పొందిన విద్యాహక్కు చట్ట ప్రకారం 6-14 వయసు వారికి ఉచిత నిర్భంద విద్యనందించాలి.
టైమ్ మ్యాగజీన్‌పై అమీర్ ఖాన్
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ‘సత్యమేవ జయతే’ టీవీ కార్యక్రమంతో కొత్త ఒరవడి సృష్టించిన బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ‘టైమ్’ మ్యాగజీన్ ముఖచిత్ర కథనానికి ఎంపికయ్యారు. ఆసియా నుంచి వెలువడే టైమ్ మేగజీన్ ఎడిషన్‌లో ఆమిర్ కనిపించనున్నారు.
‘ఖాన్ అన్వేషణ’ పేరుతో ఈ సంచిక వచ్చే వారం మార్కెట్‌లోకి విడుదలవుతుంది. ఆగస్టు 15న ప్రసారమైన కార్యక్రమంలో దేశంలో పెరుగుతున్న భ్రూణ హత్యలు, లైంగి క వేధింపులు, గృహహింస అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాలీవుడ్ తారల్లో పర్వీన్ బాబీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లు గతంలో టైమ్ ముఖచిత్రాన్ని అలంకరించారు.

Total Pageviews

Template Information

Template Information