August - 2012

లక్ష్య-1 పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి అతి చిన్న పైలట్ రహిత విమానం ‘లక్ష్య-1’ పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఆగస్టు 23న ఒడిశాలోని బాలసోర్ జిల్లా చాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించారు. ఆరు అడుగుల పొడవు ఉండే ఈ విమానం 30-35 నిమిషాల వరకు ప్రయాణిస్తుంది. వైమానిక దళ పైలట్లతో పాటు సాధారణ పైలట్ల శిక్షణ కోసం రూపొందించిన ‘లక్ష్య-1’ను నేలపై నుంచి రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. బెంగళూరులోని ఏరోనాటిక్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ దీన్ని రూపొందించింది.
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కురియన్
రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.జె. కురియన్ ఆగస్టు 21న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న కె. రహ్మన్ ఖాన్ పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియడంతో కురియన్ ఎన్నిక అనివార్యమైంది.
క్యాట్ చైర్మన్‌గా జస్టిస్ ఆలం
కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) చైర్మన్‌గా జస్టిస్ సయ్యద్ రఫత్ ఆలం ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
పృథ్వి-2 పరీక్ష విజయవంతం 
పృథ్వి -2 బాలిస్టిక్ క్షిపణి పరీక్షను ఒడిశాలోని బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు 25న విజయవంతంగా నిర్వహించారు. అణ్వస్త్ర సామర్థ్యంగల ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంలో 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500 కిలోల సంప్రదాయ అణ్వాస్త్రాలను మోసుకుపోగలదు. 9 మీటర్ల పొడవు, 1 మీటరు వ్యాసం గల ఈ క్షిపణిలో ఘన ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఇప్పటికే సైన్యంలో ప్రవేశపెట్టారు.
కోస్టల్ రాడార్ల క్లస్టర్లు ప్రారంభం
కోస్తా తీరంలో నిఘాను పెంచేందుకు ఉద్దేశించిన కోస్టల్ రాడార్లకు చెందిన మహారాష్ట్ర క్లస్టర్‌ను రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని ముంబైలో ఆగస్టు 25న ప్రారంభించారు. ఈ రాడార్లలో 10 నాటికల్ మైళ్ల దూరం వరకు పరిశీలించగల కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందులో నైట్ విజన్, ఆటోమేటిక్, ఐడెంటిఫికేషన్ సిస్టమ్, థెర్మల్ సెన్సార్లు ఉంటాయి. కోస్టల్ రాడార్ల ఏర్పాటు ప్రాజెక్ట్ కింద మొదటి దశలో రూ.600 కోట్ల ఖర్చుతో కోస్తా తీరంలో 46 స్టాటిక్ సోన్సార్లు ఏర్పాటు చేస్తారు.
కొత్త ఈసీ నసీమ్ జైదీ
ఎన్నికల కమిషనర్ (ఈసీ)గా సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ ఆగస్టు 7న నియమితులయ్యారు. ఇదివరకు ఈసీగా పనిచేసిన వీఎస్ సంపత్ ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో జైదీని కొత్త ఈసీగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. జైదీ 2017 వరకూ ఈ పదవిలో కొనసాగుతారు. జైదీ యూపీ కేడర్‌కు చెందిన 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జూలై 31న పౌర విమానయాన శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జైదీ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థల మండలిలో భారత్ ప్రతినిధిగా 2005- 2008 వరకూ వ్యవహరించారు. భారత విమానాశ్రయాల సంస్థ చైర్మన్‌గా కూడా ఆయన పనిచేశారు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌లో మరో ఈసీగా హెచ్‌ఎస్ బ్రహ్మ ఉన్నారు.
విజయవంతమైన అగ్ని-2 క్షిపణి పరీక్ష
మధ్యంతర శ్రేణి క్షిపణి-2ను భారతసైన్యం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం సమీపంలోని వీలర్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆగస్టు9న ఈ పరీక్ష నిర్వహించారు. ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించిన ఈ క్షిపణి 2000 కి.మీ పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 17 టన్నుల బరువుగల ఈ క్షిపణి 1000 కిలోల పేలోడ్‌ను మోసుకుపోగలదు. ఇప్పటి కే సైన్యంలో చేరిన ఈక్షిపణి సైన్యానికి శిక్ష ణనిచ్చే కార్యక్ర మంలో భాగంగా ప్రస్తుత పరీక్షను నిర్వహించారు.
అరుణగ్రహంపై దిగిన క్యూరియాసిటీ
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘క్యూరియాసిటీ’ శోధక నౌక ఆగస్టు 6 ఉదయం 11.01 నిమిషాలకు దిగ్విజయంగా అరుణగ్రహంపై కాలు మోపింది. ఎనిమిదిన్నర నెలల్లో సుమారు 56.7 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్యూరియాసిటీ ఏడు నిమిషాల ఉత్కంఠభరిత ‘ఎంట్రీ డిసెంట్ అండ్ ల్యాండింగ్’ ప్రక్రియను ముగించి సురక్షితంగా అంగారకుడిపైకి చేరింది. అంగారకుడిపైకి చేరిన సమాచారంతోపాటు నిమిషాల వ్యవధిలో అక్కడి ఫొటోలను పంపడం మొదలుపెట్టింది. జీవం తాలూకూ ఆనవాళ్లు ఉండే అవకాశాలపై అంచనా వేయడానికి పంపించిన క్యూరియాసిటీ మనిషి ఇప్పటివరకూ అంతరిక్షంలోకి పంపిన శోధక నౌకల్లో అతిపెద్దది. ఇది అణుశక్తితో పనిచేస్తుంది. క్యూరియాసిటీలోని ప్లూటోనియం బ్యాటరీ కనీసం పదేళ్లపాటు నిరాఘాటంగా పనిచేయగలదు. నాసా ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 250 కోట్ల డాలర్లు (రూ.పదివేల కోట్లపైనే) ఖర్చుపెట్టింది. దాదాపు టన్ను బరువు ఉన్న క్యూరియాసిటీ గాలే క్రేటర్ (దాదాపు 154 కిలోమీటర్ల వ్యాసార్ధమున్న లోయ)లో దిగింది.
రెండోసారి ఉపరాష్ట్రపతిగా అన్సారీ
రెండోసారి ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 7న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీ 252 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన అన్సారీ ఎన్‌డిఏ అభ్యర్థి జశ్వంత్ సింగ్‌పై విజయం సాధించారు. మొత్తం 790 మంది రాజ్యసభ, లోక్‌సభ సభ్యుల్లో మూడు ఖాళీలుపోగా 787 మందికి గానూ 736 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో 8 చెల్లలేదు. 47 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. చెల్లిన 728 ఓట్లలో అన్సారీకి 490, జస్వంత్ సింగ్‌కు 238 ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 నుంచి 1962 వరకు) తర్వాత ఉపరాష్ట్రపతి పదవికి రెండుసార్లు ఎన్నికైన అభ్యర్థి అన్సారీ. 75 ఏళ్ల అన్సారీ 1961 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ఆస్ట్రేలియా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆఫ్గనిస్తాన్, యూఏఈ దేశాల్లో ప్రధాన దౌత్య అధికారిగా పనిచేశారు. 1993-95 కాలంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేశారు. 2007 ఆగస్టు 11 నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు 2శాతం రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆగస్టు 9న ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 29 క్రీడాంశాల్లో రిజర్వేషన్లు వర్తింప చేస్తారు. క్రీడా పోటీ, స్థాయి గెలుపొందిన పతకాల ప్రాధాన్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు అమలు చేస్తారు.
ఐఐసీటీ శాస్త్రవేత్తకు-యంగ్ సైంటిస్ట్ అవార్డు
సీఎస్‌ఐఆర్-ఐఐసీటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ సూర్య ప్రకాశ్ సింగ్‌కు ప్రతిష్టాత్మక ఎన్‌ఏఎస్‌ఐ-యంగ్ సైంటిస్ట్ ప్లాటినం జూబ్లీ అవార్డు (2012) లభించింది. రసాయన శాస్త్ర రంగంలో విశేష కృషి చేసిన 35 ఏళ్లలోపు భారతీయ శాస్త్రవేత్తలకు ఎన్‌ఏఎస్‌ఐ (నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సైస్, ఇండియా) ఏటా ఈఅవార్డును ప్రకటిస్తుంది. ఐఐసీటీ రసాయన శాస్త్ర విభాగంలో పనిచేస్తున్న సూర్య ప్రకాశ్ డై సెన్సిటైజ్డ్ సోలార్ సెల్స్‌కు అవసరమైన పరికరాల తయా రీ, పలుచనైన ఆర్గానిక్ సోలార్ సెల్స్ రూపకల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు వరించింది. ఐఐసీటీ శాస్త్రవేత్తకు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి.
గొల్లభామ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి
మెదక్ జిల్లా సిద్దిపేట, దుబ్బాక ప్రాంతాల్లో చేనేతలు నేసిన గొల్లభామల చీరకు జియోగ్రాఫీ ఇండికేషన్ అప్లికేషన్(జీఐఏ) గుర్తింపు లభించింది. ఈ జీఐఏ జాబితా వరుస సంఖ్య 188గా నిలవడంతో ఈ చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 1940లో సిద్దిపేటకు చెందిన రచ్చ రాందాస్, కాంటసాయిలు కలిసి మొదట ఈ చీరను తయారు చేశారు.
పర్యాటక రంగంలో రెండోస్థానంలో రాష్ట్రం
స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో 2011లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2011లో 15.31 కోట్ల మంది రాష్ట్రాన్ని సందర్శించారు. కాగా 2011లో ఉత్తరప్రదేశ్‌ను 15.54 కోట్ల మంది సందర్శించడంతో మొదటి స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మహారాష్ట్ర(24.7 శాతం), రెండో స్థానంలో తమిళనాడు(17.3 శాతం), మూడోస్థానంలో న్యూఢిల్లీ(11.1శాతం) నిలిచాయి. 2011లో మొత్తం 1.94 కోట్ల మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు.
 
రాజస్థాన్‌లో అమల్లోకి విచారణ హక్కు చట్టం
విచారణ హక్కు చట్టాన్ని దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ రాష్ట్రం ఆగస్టు 1 నుంచి అమలులోకి తెచ్చింది. పాలనాపరమైన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు ఈ చట్టం సాయపడుతుంది. పాలనాపరమైన అంశాలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించని ఉద్యోగులకు ఈ చట్టం కింద రూ.500 నుంచి రూ.5,000 వరకు జరిమానా విధిస్తా మని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు.
పదేళ్లకోసారి రిజర్వేషన్లు మార్పు 
స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే రిజర్వేషన్లు ఇకపై పదేళ్ల కొకసారి రొటేషన్‌పై మారనున్నాయి. కేంద్రం ప్రతిపాదించిన పదేళ్ల విధానానికి ఆగస్టు 1న రాష్ట్ర మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించవలసి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై రాష్ట్రప్రభుత్వం మంత్రుల బృందాన్ని నియమించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిధిలో కనీసం ఐదు శాతం జ నాభా ఉంటేనే ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లలో ఎంపీ. ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీల సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కూడా మంత్రుల బృందం సానుకూలత చూపించింది.
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి
హైదరాబాద్- కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ప్రతిపాదనకు రాజకీయ వ్యవహారాల కేంద్ర క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. ఇందుకు రాజ్యాంగంలోని 371 ప్రకరణకు సవరణ చేయవలసి ఉంది. వెనుకబడిన ఉత్తర కర్ణాటకలోని ఆరు జిల్లాలను(గుల్బర్గా,యాదగిరి, రాయచూర్, బీదర్, కొప్పళ, బళ్లారి)హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంగా పేర్కొంటారు. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వలన ఈ ప్రాంతానికి ప్రాంతీయ మండలి లేదా బోర్డు ఏర్పాటు చేస్తారు. ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తారు. అభివృద్ధికి అత్యధిక గ్రాంట్లు విడుదలవుతాయి.
జీటీఏ సభ్యుల ప్రమాణ స్వీకారం
గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)లోని 45 మంది సభ్యులతోపాటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిమల్ గురుంగ్ ఆగస్టు4న ప్రమాణ స్వీకారం చేశారు. గూర్ఖాలాండ్ కొండ ప్రాంత అభివృద్ధికి జీటీఏ కృషి చేస్తోంది. కొంత కాలంగా ప్రత్యేక రాష్ట్రం కోసం అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. 2011 జూలై 18న కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం జీటీఏ ఏర్పాటైంది. కేంద్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, గూర్ఖా జనముక్తి మోర్చా (జీజెఎం) మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జూలై 29 జీటీఏకు జరిగిన ఎన్నికల్లో పోటీ లేకుండా 45 స్థానాలను జీజేఎం గెలుచుకుంది.

Total Pageviews

Template Information

Template Information