April - 2012

26 ఏప్రిల్- 02 మే 2012 కరెంట్ అఫైర్స్
అంతర్జాతీయం
భారత్ శ్రీలంక, మాల్దీవుల దోస్త్-XI నౌకావిన్యాసాలు
భారత్ కోస్ట్‌గార్‌‌డ్సతో కలిసి శ్రీలంక, మాల్దీవులు నాలుగు రోజులపాటు జరిపిన నౌకా విన్యాసాలు మార్చి 26న ముగిసాయి. సముద్ర దొంగలను అరికట్టడానికి ఈ విన్యాసాలు మాలే తీరంలో నిర్వహించారు. ఈ 11వ విన్యాసాలకు దోస్త్‌-XIగా పేరుపెట్టారు. వ్యూహాత్మక ప్రాంతం ఇండియన్ ఓసియన్ రిజియన్ (ఐఓఆర్)లో తమ కోస్ట్‌గార్‌‌డ్స మధ్య సహకారం మరింత పెంచుకోవడానికి ఈ విన్యాసాలు నిర్వహించారు. భారత్, మాల్దీవులు మొదటి ద్వైవార్షిక విన్యాసాలను 1991లో నిర్వహించాయి. 2012 విన్యాసాల్లో శ్రీలంక కూడా చేరింది.
హతాఫ్-4 క్షిపణి పరీక్ష జరిపిన పాకిస్తాన్
హతాఫ్-4 క్షిపణిని పాకిస్తాన్ ఏప్రిల్ 25న పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యమున్న ఈ క్షిపణి 1000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. హతాఫ్-4(షహీన్-1ఏ) భారత్ లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలదు.

అంతర్జాతీయ న్యాయస్థాన న్యాయమూర్తిగా భండారి
అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దల్వీర్ భండారి ఏప్రిల్ 27న ఎన్నికయ్యారు. ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ఎన్నికల్లో ఫిలిప్పైన్ న్యాయమూర్తిపై భండారి విజయం సాధించారు. 197 ఓట్లకు భండారికి 122 వచ్చాయి. 2012 నుంచి ఆరేళ్లు భండారీ ఐసీజే న్యాయమూర్తిగా కొనసాగుతారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత భారత్‌కు ఐసీజేలో న్యాయమూర్తి పదవి దక్కింది. 15 మంది సభ్యులున్న ఐసీజేలో భండారీ ఆసియాకు చెందిన మూడో ప్రతినిధి.
సీచెల్స్‌లో రాష్ర్టపతి పర్యటన
భారత రాష్ర్టపతి ప్రతిభాపాటిల్ మూడు రోజులపాటు సీచెల్స్ దేశంలో పర్యటించారు. ఏప్రిల్ 30న సీచెల్స్ నేషనల్ అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. ఆ దేశ అధ్యక్షుడు జేమ్స్ అలెక్స్ మైఖేల్‌తో చర్చలు జరిపారు. సీచెల్స్‌కు 50 మిలియన్ డాలర్ల రుణం, 25 మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను భారత్ ప్రకటించింది. మోనో రైలు ప్రాజెక్ట్, సౌర విద్యుత్ కేంద్రం, డ్యామ్ నిర్మాణానికి భారత్ అంగీకరించింది. హిందూ మహాసముద్రంలో 116 దీవులతో కూడిన దేశం సీచెల్స్.

12- 18 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
ఉత్తర కొరియా ఉపగ్రహ ప్రయోగం విఫలం
ఉత్తర కొరియా ఏప్రిల్ 13న చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లటానికి నింగిలోకి ఎగిసిన రాకెట్ మార్గమధ్యంలోనే కూలిపోయి సముద్రంలో పడిపోయింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ఇల్‌సంగ్ శత జయంతి సందర్భంగా ఆ దేశం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ‘దీర్ఘశ్రేణి క్షిపణి ప్రయోగ సాంకేతిక సామర్థ్యాన్ని’ పరీక్షించుకోవటానికే ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడుతోందని జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాలు విమర్శించాయి.
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా జిమ్ యంగ్
ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా అమెరికా నామినేట్ చేసిన వైద్య రంగ నిపుణుడు, కొరియా- అమెరికన్ జిమ్ యంగ్ కిమ్ ఎన్నికయ్యారు. ప్రపంచ బ్యాంక్ 12వ అధ్యక్షుడిగా కిమ్ జూలై 1న ప్రస్తుత అధ్యక్షుడు రాబర్ట్ బి. జోలిక్ నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో కిమ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విభాగానికి డెరైక్టర్‌గా వ్యవహరించారు.
2011లో 45వేల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
అమెరికాలో గతేడాది (2011) లో 45 వేల మంది భారతీయులకు.. అమెరికా పౌరసత్వం లభించినట్లు ఆ దేశ అంతర్గత భద్రతా విభాగం నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. అత్యధిక సంఖ్యలో అమెరికా పౌరసత్వాలు పొందిన విదేశీయుల్లో మెక్సికో తర్వాత రెండో స్థానంలో భారతీయులు (45,985) నిలిచారు. 2011లో 94,738 మంది మెక్సికన్లకు అమెరికా పౌరసత్వం లభించింది. తర్వాతి స్థానాల్లో ఫిలిప్పీన్స్ (42,520), చైనా (32,864), కొలంబియా (22,693) దేశస్థులు ఉన్నారు. వీరిలో అత్యధికులు కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్‌‌క నగరాల్లో నివసిస్తున్నారు. 2012లో ఇప్పటికే 61,142 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందినట్లు నివేదిక వివరించింది.

5- 11 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
మలావి అధ్యక్షురాలిగా జాయిస్ బందా
మలావి నూతన అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు, పీపుల్స్ పార్టీ నేత జాయిస్ బందా ఏప్రిల్ 7న ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్షుడిగా ఉన్న బింగువా ముతారికా ఏప్రిల్ 5న గుండెపోటుతో మృతి చెందడంతో బందా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. మలావి అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డుకెక్కారు.

20వ ఆసియాన్ సదస్సు
ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య(ఆసియాన్) 20వ సదస్సు ఏప్రిల్ 3,4 తేదీల్లో కాంబోడియా రాజధాని పామ్‌పెన్‌లో జరిగింది. మయన్మార్‌పై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ఆసియాన్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేసింది. వివాదాస్పద ఖండాంతర రాకెట్ ప్రయోగం విరమించుకోవాలని ఉత్తరకొరియాను కోరింది. 2015 నాటికి ఆసియాన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని కూడా ఆసియాన్ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆసియా న్‌లో 10 దేశాలు బ్రూనే, కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్,లావోస్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 8.8 శాతం మంది ప్రజలు ఆసియాన్ దేశాల్లో నివసిస్తున్నారు. 1967, ఆగస్టు 8న థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఏర్పాటైన ఆసియాన్ తొలి సమావేశం 1976 బాలి(ఇండోనేషియా)లో జరిగింది.

మాలి ఉత్తర ప్రాంతంలో స్వతంత్ర ప్రకటన
మాలి ఉత్తర ప్రాంతాన్ని తరెగ్ తిరుగుబాటుదారులు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఏప్రిల్ 6, 2012 నుంచి ‘అజావద్’ పేరిట మాలి ఉత్తర ప్రాంతం స్వతంత్ర దేశంగా ఉంటుందని మాలి నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ అజావద్ సంస్థ ప్రకటించింది. దీంతో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉత్తరప్రాంతం, సైనిక పాలకుల కింద దక్షిణ ప్రాంతం ఉన్నాయి. సంచార జాతికి చెందిన తరెగ్ ప్రజలు 1958 నుంచి ఉత్తర ప్రాంత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నారు. దేశ రాజధాని, ఆర్థిక వ్యవస్థ న ల్లజాతి ప్రజల నియంత్రణలో ఉంది. దీంతో ఉత్తర ప్రాంత అభివృద్ధిని దక్షిణ ప్రాంతీయులు నిర్లక్ష్యం చేస్తున్నారని తరెగ్‌లు ఆరోపిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో అధికారం హస్తగతం చేసుకున్నట్లు మార్చి 22న ఆ దేశ సైన్యం ప్రకటించింది. మాలి ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతంపై దక్షిణ ప్రాంతం ఆధిపత్యం కొనసాగిస్తోంది. దీంతో 1960 నుంచి నాలుగుసార్లు తిరుగుబాట్లు జరిగాయి.

ఐరాస పట్టణీకరణ నివేదిక
రానున్న నాలుగు దశాబ్దాల్లో భారత్, చైనాల్లోని నగరాల జనాభా కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా నగర జనాభా పెరుగుదలలో ఆఫ్రికా, ఆసియా దేశాలు ముందుటాయని ఐరాస-డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆఫైర్స్ విడుదల చేసిన ‘రివిజన్ ఆఫ్ ద వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2011’ నివేదిక పేర్కొంది. ఆసియాలోని భారత్, చైనాలో, ఆఫ్రికాలోని నైజీరియాలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుందని నివేదిక వివరించింది. అమెరికా, ఇండోనేషియాల్లోనూ గణనీయంగా జనాభా పెరగనుందని తెలిపింది. భారత పట్టణ జనాభా వచ్చే నాలుగు దశాబ్దాల్లో (2010-50 నాటికి) 497 మిలియన్ల(దాదాపు 50 కోట్లు)కు చేరుకోవచ్చని ఈ నివేదిక తెలిపింది. దీని ప్రకారం.. ఇదే సమయంలో చైనా పట్టణ జనాభా 341 మిలియన్లకు పెరుగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో నైజీరియా(20 మిలియన్లు), అమెరికా(103 మిలియన్లు), ఇండోనేషియా(92 మిలియన్లు) దేశాలు ఉంటాయి.
నగరాల పరంగా చూస్తే 2025 నాటికి 39 మిలియన్ల జనాభాతో జపాన్ రాజధాని టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ (33 మిలియన్లు), షాంఘై (చైనా-28.4 మిలియన్లు), ముంబై(27 మిలియన్లు) ఉంటాయని నివేదిక పేర్కొంది.

29 మార్చి- 4 ఏప్రిల్ 2012 కరెంట్ అఫైర్స్
సియోల్‌లో అణు భద్రత సదస్సు
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో రెండో అణు భద్రత సదస్సు మార్చి 26, 27 తేదీల్లో జరిగింది. ఇందులో 53 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అణు భద్రతను పటిష్టం చేయడం, అణు ఉగ్రవాద భయాన్ని తగ్గించడం, తీవ్రవాదులు, నేరస్తులు, ఇతర చట్ట వ్యతిరేక సంస్థలు అణు పదార్థాలు పొందకుండా నిరోధించే దిశగా పని చేయాలని సదస్సు తీర్మానించింది. అంతర్జాతీయ భద్రతకు అణు తీవ్రవాదం అత్యంత సవాలుగా నిలిచిందని సదస్సు పేర్కొంది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రసంగిస్తూ ప్రపంచంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తేనే అణుభద్రత సాధ్యమవుతుందని అన్నారు. అణు భద్రతపై తొలి సదస్సు 2010లో అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగింది. తదుపరి సదస్సుకు 2014లో నెదర్లాండ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.

దలైలామాకు టెంపుల్టన్ ప్రైజ్
టిబెట్ మత గురువు దలైలామా టెంపుల్టన్ ప్రైజ్-2012 కు ఎంపికయ్యారు. లండన్‌లో మే 14న జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డును జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ అందజేస్తుంది. దీన్ని 1972లో నెలకొల్పారు. దలైలామాకు 1989లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది.

అరబ్ లీగ్ సదస్సు
రాక్ రాజధాని బాగ్దాద్‌లో మార్చి 29న అరబ్ లీగ్ దేశాల సదస్సు జరిగింది. సిరియా సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనుక్కోవాలని సదస్సులో పాల్గొన్న నేతలు కోరారు. ఈ సదస్సును ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్-కీ-మూన్ ప్రారంభించారు. సిరియాలో సంక్షోభ నివారణ కోసం యూఎన్-అరబ్ లీగ్ ప్రతినిధి కోఫి అన్నన్ సూచించిన ప్రణాళికను అమలు చేయాలని ఆ దేశాధ్యక్షుడు అస్సాద్‌కు బాన్-కీ-మూన్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అరబ్‌లీగ్ సదస్సు బాగ్దాద్‌లో జరిగింది. ఈ లీగ్ నుంచి సస్పెండ్ అయిన సిరియాను సదస్సుకు ఆహ్వానించలేదు. అరబ్ లీగ్‌లో 22 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ‘ఎర్త్ అవర్’
భూగోళం పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మార్చి 31న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పేసి ‘ఎర్త్ అవర్’ పాటించారు. గతేడాది ఎర్త్ అవర్‌లో 135 దేశాలు పాల్గొనగా, ఈ ఏడాది ఆ సంఖ్య 147కు పెరిగింది. వాతావరణ మార్పులపై ప్రజల్లో చైతన్యం కల్గించేందుకు వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్‌ను తొలి సారిగా నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా మార్చి చివరి శనివారం ఈ కార్యక్రమాన్ని పాటిస్తున్నారు. మన దేశంలో ఎర్త్ అవర్‌ను 2009 నుంచి నిర్వహిస్తున్నారు.

న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు
బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల నాలుగో సదస్సు మార్చి 29న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సులో బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్, చైనా అధ్యక్షుడు హూ జింటావో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ నేతలు ఉమ్మడి ఢిల్లీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఇందులోని ముఖ్యాంశాలు..

  • ఇరాన్ అణు కార్యక్రమం సంక్షోభాన్ని దౌత్యపరంగా పరిష్కరించడం
  • ప్రపంచ బ్యాంకు తరహాలో తమ ఆర్థిక అవసరాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి బ్యాంకు ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాల పరిశీలన
  • ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలలో సంస్కరణలకు పిలుపు.
  • తమ స్థానిక కరెన్సీలోనే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా సంబంధిత ఒప్పందాలపై సంతకాలు.
  • తొలిసారి 2006లో న్యూయార్క్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా విదేశాంగ మంత్రులు సమావేశమయ్యారు. దీన్ని బ్రిక్(BRIC)గా వ్యవహరించేవారు. మొదటి సదస్సు 2009లో ఎకటెరిన్ బర్గ్(రష్యా)లో జరిగింది. రెండో సదస్సుకు బ్రెసిలియా(బ్రెజిల్), మూడో సదస్సుకు సాన్యా(చైనా) వేదికలుగా నిలిచాయి. ఈ సదస్సులో దక్షిణాఫ్రికా చేరడంతో ఈ కూటమిని బ్రిక్స్ (BRICS)గా వ్యవహరిస్తున్నారు. ఈ దే శాలు ప్రపంచ జనాభాలో సగ భాగం జనాభాను కలిగి ఉన్నాయి. ఐదో సదస్సుకు 2013లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమివ్వనుంది.

Total Pageviews

Template Information

Template Information