PREPARATION PLAN



ఎక్సైజ్ కానిస్టేబుల్ స్టడీ మెటీరియల్
‘పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకునే సువర్ణావకాశం. నిరుద్యోగులపాలిట కల్పవృక్షం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ ’. ఈ నోటిఫికేషన్ ద్వారా 2,606 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను ఎక్సైజ్ శాఖ భర్తీ చేయనుంది. ప్రభుత్వోద్యోగాలకు తీవ్రమైన పోటీ ఉండడం సాధారణం. అయితే ఈ పోస్టులకు కనీస అర్హత పదోతరగతే కావడంతో పోటీ పడే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే ఉండొచ్చని ఓ అంచనా. పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా పకడ్బందీ ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం తథ్యం. ఈ నేపథ్యంలో శారీరక సామర్థ్య పరీక్ష నుంచి రాత పరీక్ష వరకూ ప్రిపరేషన్ ప్లాన్ మీకోసం....

ఎంపిక ప్రక్రియ: రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ.. శారీరక సామర్థ్య పరీక్ష. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే రెండో దశ.. రాత పరీక్షకు అర్హులు. శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్షల్లో వచ్చిన మార్కులు ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి రిజర్వేషన్లననుసరించి ఆయా జిల్లాల కు కేటాయించిన పోస్టుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

శారీరక సామర్థ్య పరీక్ష..
ఈ విభాగం ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే రెండు దశలుగా ఉంటుంది. ఇందులో అత్యంత కీలక దశ.. ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే రెండో దశకు అనుమతిస్తారు. ఇందులో నిర్దేశించిన దూరాన్ని.. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 4 కి.మీ. దూరాన్ని 20 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 2 కి.మీ.ల దూరాన్ని 13 నిమిషాల్లో చేరుకోవాలి.

రెండో దశ.. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తిరిగి రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థుల శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు ఉన్న వారినే మాత్రమే సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత రెండో దశకు అనుమతిస్తారు. రెండో దశలో ఉండే ఈవెంట్లు..
అంశం క్వాలిఫైయింగ్ టైమ్/దూరం
పురుషులు మహిళలు
100 మీ. పరుగు 15 సెకన్లు 18 సెకన్లు
హై జంప్ 1.20 మీటర్లు -----
లాంగ్ జంప్ 2.75 మీటర్లు
షాట్‌పుట్
5.60 మీటర్లు
(7.26 లోలు)
4.5 మీటర్లు
(4 కిలోలు)
800 మీ. పరుగు 2 ని. 50 సె. -----

ఈవెంట్లలో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు. అభ్యర్థులు అన్ని ఈవెంట్లలో అర్హత సాధించాలి. ఏ ఒక్క అంశంలో విఫలమైనా.. తర్వాతి దశకు అనుమతించరు.
విభాగాల వారీగా రాతపరీక్ష వివరాలు, మార్కులు
క్రమ.సం. అంశం మార్కులు
పార్ట్-1 జనరల్ ఆప్టిట్యూడ్
ఎ) న్యూమరికల్ ఎబిలిటీ
బి) రీజనింగ్ ఎబిలిటీ

25
25
పార్ట్-2 జనరల్ నాలెడ్జ్
సెక్షన్ ఎ) ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భూగోళ శాస్త్రం
సెక్షన్ బి) భారత రాజ్యాంగం, కరంట్ అఫైర్స్
సెక్షన్ సి) జనరల్ సైన్స్
15
15
20

మొత్తం మార్కులు 100

ఆబ్జెక్టివ్ పరీక్ష.. 100 మార్కులు:
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి రెండు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. పరీక్ష పత్రం ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. ఇందులో పార్ట్-1, పార్ట్-2 ఉంటాయి. పార్ట్-1లో జనరల్ ఆప్టిట్యూడ్, పార్ట్-2లో జనరల్ నాలెడ్జ్ విభాగం ఉంటుంది.
జనరల్ ఆప్టిట్యూడ్:
ఈ విభాగంలో న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
న్యూమరికల్ ఎబిలిటీ: ప్రధానంగా సంఖ్యా వ్యవస్థ, క.సా.గు.-గ.సా.భా., నిష్పత్తి-అనుపాతం, శాతాలు, క్షేత్రమితి, సమితులు, సంభావ్యత, కాలం- దూరం-పని వంటి అంశాలపై పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ప్రాథమిక భావనలపై పట్టు సాధిస్తే మంచి మార్కులు స్కోర్ చేయవచ్చు. 1-20 వరకు ఎక్కాలు, 1-40 వరకు వర్గాలు, 1-20 వరకు ఘనాలు, 1-10 వరకు ఘాతాలు, వర్గమూలాలపై అవగాహన పెంచుకోవాలి. సంబంధిత సూత్రాలు, ప్రాథమిక భావనల ద్వారా సమస్యలను సాధించడం నేర్చుకోవాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించడానికి 80 సెకన్ల వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో సరైన సమాధానాన్ని గుర్తించడం సులభమే. సిలబస్ వారీగా ప్రశ్నల్ని సాధన చేస్తే ఉత్తమ మార్కులు సాధించవచ్చు.
రిఫరెన్స్ బుక్స్: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (ఆర్.ఎస్. అగర్వాల్); క్వికర్ మ్యాథ్స్ (తైరా, కుందన్); 7, 8, 9, 10 తరగతుల గణిత పాఠ్య పుస్తకాలు.

రీజనింగ్ ఎబిలిటీ: ప్రధానంగా సంఖ్యాశ్రేణి, కోడింగ్-డీకోడింగ్, ర్యాంకింగ్ టెస్ట్, పోలిక పరీక్ష, రక్తసంబంధాలు, దిక్కులు, సీటింగ్ ఎరేంజ్‌మెంట్స్, డిక్ష్నరీ టెస్ట్, అర్థమెటికల్ రీజనింగ్, వెన్ డయాగ్రమ్స్, డైస్ (పాచికలు), నాన్‌వెర్బల్ రీజనింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ అక్షర శ్రేణి, వర్గాలు, ఘనమూలాలపై అవగాహన పెంచుకోవాలి. మాదిరి ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.

రిఫరెన్స్ బుక్స్: వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ (ఆర్.ఎస్. అగర్వాల్)

జనరల్ నాలెడ్జ్:
ఆంధ్రప్రదేశ్ చరిత్ర- భూగోళశాస్త్రం, సివిక్స్- కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ విభాగాలపై ప్రశ్నలు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భూగోళశాస్త్రం: ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి శాతవాహనులు, పల్లవులు, విష్ణుకుండినులు, కాకతీయులు, విజయనగర రాజులు, కుతుబ్‌షాహీ వంశం, ఐరోపా వాసుల రాక, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో స్వాతంత్య్రోద్యమాలు వంటి అంశాలతోపాటు 1956 నుంచి నేటి వరకు చోటుచేసుకున్న సంఘటనలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీంతోపాటు భారతదేశ చరిత్రలోని ప్రాథమికాంశాలను చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది.

భూగోళ శాస్త్రం: ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణస్థితి, నదులు, నేలలు, నీటిపారుదల వ్యవస్థ, అడవులు, ఖనిజ వనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, జనాభా, సరిహద్దు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఇవేకాక ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నలడగొచ్చు.

రిఫరెన్స్ బుక్స్: సంబంధిత ఎన్‌సీఈఆర్‌టీ-రాష్ట్ర ప్రభుత్వ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు; ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం-తెలుగు అకాడెమీ; అట్లాస్.

సివిక్స్(భారత రాజ్యాంగం)-కరెంట్ అఫైర్స్: భారత రాజ్యాంగం-రాజకీయ వ్యవస్థలతో పాటు కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలి. భారత రాజ్యాంగ నిర్మాణం, ప్రాథమిక విధులు, హక్కులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, పార్లమెంటు, కోర్టులు, కాగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

రిఫరెన్స్ బుక్స్: భారత రాజ్యాంగానికి సంబంధించి తెలుగు అకాడెమీ ప్రచురణలు, భారత ప్రభుత్వాలు- రాజకీయాలు, భారత రాజ్యాంగం వంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు.

కరంట్ అఫైర్స్: పరీక్ష తేదీకి కనీసం సంవత్సరం ముందు నుంచీ చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ సంఘటనలను సమగ్రంగా తెలుసుకోవాలి. ప్రధానంగా వార్తల్లో వ్యక్తులు, అవార్డులు, వార్తల్లో ప్రదేశాలు, అంతర్జాతీయ- జాతీయ ప్రాముఖ్యం ఉన్న సమావేశాలు, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగంలోని పరిశోధనలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాజాభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దినపత్రికలు, మ్యాగజీన్లలోని ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవడం ఉపకరిస్తుంది.

రిఫరెన్సెస్: తెలుగు, ఇంగ్లిష్‌ల్లో ఏవైనా రెండు ప్రముఖ దినపత్రికలు. ఫ్రంట్ లైన్, ఇండియా టుడే వంటి ఇంగ్లిష్ మ్యాగజీన్స్. ఆలిండియా రేడియో స్పాట్‌లైట్ కార్యక్రమం.

జనరల్ సైన్స్: భౌతిక, రసాయన శాస్త్రం, బయాలజీ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌతిక శాస్త్రంలో ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతం, లేజర్ కిరణాలు, నిత్య జీవితంలో మానవ మనుగడకు అవసరమయ్యే రసాయనాలు మొదలైన పాఠ్యాంశాల్నుంచి, బయాలజీ లో మానవ శరీర నిర్మాణం - వివిధ వ్యవస్థలు, వ్యాధులు-నివారణ, విటమిన్లు, రక్తవర్గాలు, మొక్కల జాతులు, పెరుగుదలని నియంత్రించే కారకాలు, ప్రత్యుత్పత్తి మొదలైన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 1947 నుంచి నేటి వరకు దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి, సమకాలీన సంఘటనలు... మొదలైన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

రిఫరెన్స్ బుక్స్: ఎన్‌సీఈఆర్‌టీ-రాష్ట్ర ప్రభుత్వ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు; మార్కెట్‌లో లభించే ప్రామాణికమైన సైన్స్ మెటీరియల్ .

ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధం :
4 కి.మీ.పరుగు పందెం: పరిగెత్తేటప్పుడు స్పోర్ట్స్ షూ, కాన్వాస్ షూ వాడాలి. పలుచని కాటన్ సాక్స్ ధరించాలి. షూ లేకుండా పరుగెత్తే అభ్యర్థులు కాలివేళ్లకు, పాదాలకు కాటన్ ప్లాస్టర్ చుట్టాలి. ప్రతిరోజు 4 కి.మీ. పరిగెత్తేందుకు ప్రయత్నించాలి. అంతదూరం పరిగెత్తలేక పోతుంటే కనీసం 2 కి.మీ. పరుగెత్తాలి. వారానికోసారి 4 కి.మీ. సెల్ఫ్ టెస్ట్ చేసుకుంటూ పరుగెత్తాలి. ఎన్ని సెకన్లలో పరుగు పూర్తిచేశారో రికార్డు చేసుకుని 4 కి.మీ. పరుగుకు టార్గెట్ నిర్ణయించుకోవాలి. పరిగెత్తేటప్పుడు నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు పెట్టుకోవడం సరికాదు. పరుగెత్తేటప్పుడు ఆక్సిజన్ అవసరం కాబట్టి కేవలం ముక్కుతో గాలి పీలిస్తే సరిపోదు కాబట్టి నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. పరిగెత్తేటప్పుడు కాలి అంగలు ఎలా వీలయితే అలా వేయాలి. పరుగులో కండరాలను, పిడికిలిని గట్టిగా బిగించకుండా జాగ్రత్తపడాలి.

100 మీ. పరుగు: ప్రాక్టీస్‌లో 100 మీ.కోసం 100 మీ.లు మాత్రమే పరుగెత్తకూడదు. ఒక రోజులో 30 మీ. 3 సార్లు, క్రమంగా 60 మీ. 3 సార్లు, 90 మీ. 3 సార్లు, ఇంకో రోజు 120మీ. 3 సార్లు ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఈవెంట్‌లో ప్రారంభ స్థానంలో బొటనవేలి (ౌ్ట్ఛ)పై నిలబడి విజిల్ సౌండ్ మీద దృష్టి ఉంచి ఆ శబ్దానికనుగుణంగా పరుగును ప్రారంభించాలి. విజిల్ వేసే వారిని చూడకూడదు.

హై జంప్: ఎక్కువ ఎత్తు దూకడానికి కాలి కండరాల బలం, శరీర భాగాల సమన్వయ శక్తి ఉపయోగపడతాయి. ఈ పోటీలో 1.20 మీ. ఎత్తు దూకాలి. అందుకోసం ముందుగా రనప్ చేసి ఎత్తుకు ఎగరడాన్ని, నేలకు సురక్షితంగా చేరడమెలాగో తెలుసుకోవాలి. రనప్ ప్రధానంగా ఎత్తు ఎగరడానికి కావలసినంత వేగంతో చక్కని టేక్ ఆఫ్ పొజిషన్ (గాలిలో ఎగరడం) తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో బెడ్ (ఇసుక ట్రాక్) లేనివారికి Belly Role టెక్నిక్ చాలా ఉపయోగకరం. ఈ పద్ధతిలో ఎడమ కాలితో టేకాఫ్ తీసుకొని జంప్ చేసినప్పుడు బార్ మీద పడుకునే పొజిషన్‌లో ఉండాలి. ఇసుకలో మొదట కుడికాలు ల్యాండ్ అవుతూ, అదే సమయంలో Elbow మీదుగా ల్యాండ్ కావాలి. మామూలుగా దూకేవారు మినిమమ్ స్పీడ్‌తో గట్టిగా కిక్ కొట్టి బార్‌కి తగలకుండా పైకి ఎగరాలి. ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేస్తే వీలైనంత ఎత్తు ఎగరొచ్చు.

లాంగ్ జంప్: ఇందులో హాంగ్‌స్టైల్‌ను ఉపయోగిస్తే సులభంగా క్వాలిఫై అవ్వొచ్చు. ఈ శైలిలో గాలిలో శరీరాన్ని కాళ్లు, చేతులను వెనక్కు వంచి ఊపుతూ, ముందుకు దూసుకెళ్తూ, నేలమీదకు ల్యాండ్ అయ్యే ముందు కాళ్లు, చేతులను ముందుకు తేవాలి. 50 మీ. స్పీడ్‌గా రన్ ప్రాక్టీస్ చేయాలి. లాంగ్‌జంప్‌లో స్పీడ్‌గా రావడమే కాక టేకాఫ్ దగ్గర గట్టిగా కిక్ కొట్టాలి. బాడీ టేకాఫ్ కాళ్ల కంటే ముందుకు వంగి ఉంటే 30 సెం.మీ. వరకు జంప్ పెరుగుతుంది.

షాట్‌పుట్: శ్వాసను బాగా పీల్చి అరచేతితో కాకుండా వేళ్లతో పట్టుకొని 40 డిగ్రీల కోణంలో షాట్‌పుట్‌ను విసరాలి. ఎప్పుడూ ఫ్లాట్‌గా విసరకూడదు. వెనుకకు వంగి, ఒక్కసారిగా ముందుకు వచ్చి విసిరితే సులభంగా టార్గెట్ చేయొచ్చు.

800 మీ. పరుగు: దీనికి ఎక్కువ దూరం పరుగెత్తడం ప్రాక్టీస్ చేయాలి. కనీసం వారానికోసారైనా 3000 మీ., 5000 మీ.దూరం పరుగెత్తాలి. దీంతో పాటు 1000 మీ. రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇలాగే 800 మీ., 600 మీ.లు మూడు సార్లు పరిగెత్తడం వల్ల వేగం పెరుగుతుంది.

పోటీ రోజు చేయాల్సినవి:
పోటీకి మూడు గంటల ముందు నుంచి ఎక్కువ ఆహారం తీసుకోకుండా తేలికైన ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. గ్లూకోజ్‌ను నీటితో కలిపి (10 శాతం మాత్రమే) మాత్రమే తీసుకోవాలి. పోటీకి ముందు నిలబడటం, ఎక్కువగా మాట్లాడటం చేయకూడదు. పరుగుపోటీలో వేగాన్ని ఒక్కసారి కాకుండా క్రమంగా పెంచుకుంటూ పోవాలి. పరిగెత్తేటప్పుడు శరీరం ముందుకు వంచాలి. మడమల మీద పరుగెత్తకూడదు. మోకాళ్లు సాధ్యమైనంత పైకి లేపాలి. చేతులు, కాళ్ల యాక్షన్‌కు అనుకూలంగా కదలాలి. రేస్ చివరకు చేతుల కదలికలను పెంచడం ద్వారా కొద్దిగా పరుగు వేగాన్ని పెంచుకోవచ్చు.

నోటిఫికేషన్ సమాచారం
మొత్తం పోస్టులు (అన్ని జాల్లాలు కలిపి): 2606 (పురుషులు-1771; మహిళలు-835;)
పేస్కేల్: రూ. 7960 23650/
అర్హత: 10వ తరగతి/తత్సమానం
వయసు: 18 నుంచి 30 ఏళ్లు (జూలై 1, 2012 నాటికి).

శారీరక ప్రమాణాలు:

పురుషలు-ఎత్తు: 165 సెం.మీ. ఛాతీ: 81 సెం.మీ. గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి.
మహిళలు-ఎత్తు:152. 5 సెం.మీ. (బరువు 45.5 కి.)
దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 5, 2012.
వివరాలకు: http://cpe.cgg.gov.in/

Total Pageviews

Template Information

Template Information