July - 2012

తిరుగుబాటు వ్యతిరేక ఒప్పందంపై కాంగో, రువాండా సంతకాలు
తూర్పు కాంగోలో తిరుగుబాటు దళాలను తుదముట్టించేందుకు కాంగో, రువాండా దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబిలా, రువాండా అధ్యక్షుడు పౌల్ కగామే ఇతర నాయకులతో కలిసి జూలై 17న ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. తూర్పు కాంగో ప్రాంతాల్లో తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అంతర్జాతీయ సైనిక దళం ఏర్పాటును ఈ ఒప్పందం సూచిస్తుంది.

తూర్పు కాంగో సరిహద్దు ప్రాంతాల్లో ‘తుత్సీ’ల నాయకత్వంలో ఎం 23 తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఇరుదేశాలు ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. సరిహద్దు శత్రు దేశాలుగా కొనసాగిన కాంగో, రువాండా గతంలో యుద్ధానికి కూడా దిగాయి. తిరుగుబాటు దళాలకు తోడ్పడుతుందని పరస్పరం నిందించుకున్న రెండు దేశాలు నేడు తిరుగుబాటును అణచి వేసేందుకు చేతులు కలిపాయి.
డబ్ల్యూటీవోలో చేరికకు రష్యా ఆమోదం
ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) లో చేరడానికి రష్యా ఎగువ సభ జూలై 18న ఆమో దం తెలిపింది. రష్యా డబ్ల్యూటీవోలో చేరికపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. గత 18 సంవత్సరాలుగా డబ్ల్యూటీవోలో రష్యా చేరికపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దిగువసభ ‘డ్యూమా’ గత వారమే రష్యా చేరిక ఒప్పందానికి ఆమోదం తెలిపిం ది. ఈ బిల్లుపై అధ్యక్షుడు సంతకం చేయడమే మిగిలింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే 30 రోజుల్లో రష్యా డబ్ల్యూటీవో సభ్యదేశమౌతుంది. డబ్ల్యూటీవోలో చేరిక వల్ల తయారీ రంగ పరిశ్రమ, వ్యవసాయ రంగం నాశనమవుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దిగుమతి సుంకాలు సరాసరి 9.56 శాతం నుంచి 2015 నాటికి ఆరు శాతానికి తగ్గించేందుకు రష్యా అంగీకరించిందని విమర్శకులు పేర్కొంటున్నారు.
హెచ్‌ఐవీ నివారణ మందుకు అమెరికా ఆమోదం
హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ వ్యాధి నివారణకు వాడే ‘తృవడా’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ జూలై రెండో వారంలో ఆమోదం తెలిపింది. ఎయిడ్స్ వ్యాధి నివారణ మందుకు అమెరికా సంస్థ ఆమోదం తె లపడం ఇదే తొలిసారి. ‘గిలీడ్ సెన్సైస్’ సంస్థ తయారు చేసిన ఈ మందు 2004 నుంచి అందుబాటులో ఉంది. ఈ మందు వ్యాధి సోకకుండా నివారించేందుకు తోడ్పడుతుందని క్లినికల్ అధ్యయనాలు తెలిపాయి.
ప్రపంచంలో హెచ్‌ఐవీ బాధితులు 3.42 కోట్ల మంది
ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తులు 3.42 కోట్లు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. 2011లో కొత్తగా 25 లక్షల మందికి హెచ్‌ఐవీ సోకింది. భారత్‌లో 2000 నుంచి ఈ వ్యాధి సోకేవారి సంఖ్య సగానికి తగ్గిందని నివేదిక తెలిపింది.
12-18 జూలై 2012
 
 
అంతర్జాతీయం
జనాభా కార్యాచరణపై సదస్సు
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11న జనాభా కార్యాచరణపై జాతీ య సదస్సు జరిగింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జనసంఖ్య స్థిరత కోష్ ఈ సమావేశం నిర్వహి ంచింది. ‘‘టువర్‌‌డ్స ఎ బెటర్ టు మారో ’’ అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సులో దేశ జనాభాను స్థిరీకరించేందుకు సంఘటిత కార్యాచరణకు పిలుపునిచ్చింది. కుటుంబ నియంత్రణను ముఖ్యంగా అత్యధిక ప్రాధాన్యత గల రాష్ట్రాల్లో పునరుద్ధరించడం, రాజకీయ నాయకులను, ఇతర మంత్రిత్వ శాఖలను భాగస్వామ్యం చేయ డం వంటి అంశాలను సదస్సు చర్చించింది.
ప్రపంచ తొలి తెలుగు చరిత్ర మహాసభలు
ప్రపంచ తొలి తెలుగు చరిత్ర మహాసభలు లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో జూలై 15న ముగిసాయి. రెండు రోజులు జరిగిన ఈ మహాసభలను లండన్‌లోని యునెటైడ్ కింగ్‌డమ్ తెలుగు సంఘం నిర్వహించింది. తెలుగుభాష, చరిత్ర, సాంస్కృతిక వికాసాలను భవిష్యత్తు తరాలకు అందించాలని, చరిత్ర పూర్వ యుగంలో తెలుగువారి ఉనికిపై పరిశోధనలు కొనసాగించాలని సదస్సు పిలుపునిచ్చింది. తెలుగు చరిత్రను పరిరక్షించేందుకు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సంస్థను ఏర్పాటు చేయాలని సదస్సు తీర్మానించింది.

ఏయూ కమిషన్ చైర్‌పర్సన్‌గా దామిని జూమా
ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) కమిషన్ ఛైర్‌పర్సన్‌గా దక్షిణాఫ్రికా హోంశాఖ మం త్రి కొనజానా దామిని జూమా (63) జూలె 15న ఎన్నికయ్యారు. ఈమె ఏయూ తొలి మహిళా నాయకురాలు. దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి ఈ పదవిని చేపట్టడం ఇదే ప్రథమం. ఈ ఎన్నికల్లో ఆమె గబాన్‌కు చెందిన జియన్ సింగ్‌పై విజయం సాధించింది. 54 ఆఫ్రికన్ యూనియన్ దేశాల్లో జూమాకు 37 ఓట్లు వచ్చాయి.
ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం
ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందంపై భారత్- మొజాంబిక్ దేశాలు జూలై 16న సంతకాలు చేసాయి. మొజాంబిక్ పర్యటనలో ఉన్న భారత హోంశాఖ సహాయమంత్రి ముల్లపల్లె రామచంద్రన్, మొజాంబిక్ ఇంటీరియల్ మంత్రి జోస్ మంద్రా ఇరుదేశాల మధ్య సహకారంతోపాటు ఉమ్మడి ప్రయోజనాలుగల వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అక్కడ కొన్ని దశాబ్దాలుగా 25,000 మంది భారత సంతతి వారు ఉన్నారు.
రచయిత స్టీపెన్ కోవె మృతి
ప్రముఖ ఆంగ్ల రచయిత కోవె (79) జూలె 16న సాల్టేలేక్ సిటీ సమీపాన ఇదాహాలో మరణించారు. ఆయన రాసిన సెవెన్ హ్యా బిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది, ఈ పుస్తకం 38 భాషల్లో 20 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయాయి
04-11 జూలై 2012
 
దైవకణాన్ని గుర్తించిన సెర్న్ శాస్త్రవేత్తలు
విశ్వంలోని పదార్థానికి ద్రవ్యరాశినిచ్చే ‘దైవకణాన్ని’ గుర్తించినట్లు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సెర్న్) శాస్త్రవేత్తలు జూలై 4న ప్రకటించారు. ఈ హిగ్స్‌బోసన్ ఉప పరమాణు కణాన్ని గుర్తించేందుకు 50 ఏళ్ల నుంచి పరిశోధన జరుగుతోంది. దీనివల్ల విశ్వంలోని ఇతర రహాస్యాలను కూడా కనుగొనేందుకు మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ దైవ కణాన్ని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సరిహద్దులో ఏర్పాటు చేసిన లార్జ్ హేడ్రెన్ కొలైడర్(ఎలెహెచ్‌సీ) ప్రయోగశాలలో కనుగొన్నారు. భూమికి లోపల 300 అడుగులు కింద 27 కిలో మీటర్ల భారీ గొట్టంలో ఈ ఎల్‌హెచ్‌సీని పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 21,000 కోట్లు ఖర్చుతో 2010 నుంచి పరిశోధనలు ప్రారంభించారు. ఈ ప్రయోగంలో 1200 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇందులో భారతీయులు 50 నుంచి 60 మంది ఉన్నారు. కొన్ని భారతీయ సంస్థలు కూడా ఈ పరిశోధనలకు తోడ్పడ్డాయి.
ఎల్‌హెచ్‌సీలో కాంతి వేగంతో రెండు ప్రోటాన్ పరమాణువులను ఢీ కొట్టించడం ద్వారా బిగ్‌బ్యాంగ్ తర్వాత ఏర్పడిన పరిస్థితులను శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ ప్రక్రియలోనే దైవ కణాన్ని గుర్తించినట్లు సెర్న్ ప్రకటించింది.
హిగ్స్ బోసన్:
భారతీయ భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ పేరు నుంచి హిగ్స్ బోసన్‌లోని బోసన్ పేరును చేర్చారు. బోస్ ఐన్‌స్టీన్ సమకాలీకుడు. విశ్వంలోని ప్రతి దానికీ ద్రవ్యరాశి ఉంటుందని బోస్ పరిశోధనలు తెలియజేశాయి. హిగ్స్ అనేపదం బ్రిటీష్ శాస్త్రవేత్త పీటర్‌హిగ్స్ పేరులోంచి వచ్చింది. 1964లో హిగ్స్ మరో ఆరుగురు శాస్త్రవేత్తలతో కలిసి విశ్వం మొత్తం ఒక అదృశ్య శక్తి క్షేత్రం అవరించి ఉంటుందని ప్రతిపాదన చేశారు. ఆ క్షేత్రం చిన్న ప్రాథమిక కణాలతో వేర్వేరు శక్తులతో సంబంధాలేర్పరచుకుని ఉంటుందని పేర్కొన్నారు.
షహాబ్ క్షిపణిని పరీక్షించిన ఇరాన్
షహాబ్-3 బాలిస్టిక్ క్షిపణిని ఇరాన్ జూలై3న విజయవంతంగా పరీక్షించింది. గ్రేట్ ప్రొఫెట్-7 మూడు రోజుల విన్యాసాల్లో భాగంగా కావిక్ ఎడారిలో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ ఈ పరీక్ష నిర్వహించింది. 2000 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. దీంతోపాటు షహాబ్-1, షహాబ్-2 క్షిపణులను కూడా ఇరాన్ పరీక్షించింది. ఇవి రెండూ వరుసగా 300, 500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.
ఇండియన్ ముజాహిదీన్‌పై బ్రిటన్ నిషేధం
లష్కర్ తోయిబా అనుబంధ సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) పై నిషేధానికి సంబంధించిన ప్రతిపాదనకు బ్రిటన్ హౌస్ ఆఫ్ కామర్స్ జూలై 5న ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఇప్పటివరకు నిషేధం విధించిన సంస్థల్లో ఐఎం 47వది. ప్రజలపై దాడులు చేయడంతోపాటు దీనివల్ల భారత్‌లోని బ్రిటన్ జాతీయులకు ప్రమాదం పొంచి ఉందని, భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష ్యంతో ముజాహిదీన్ పనిచేస్తోందని బ్రిటన్ ఈ సందర్భంగా పేర్కొంది. ఈ సంస్థపై ఇప్పటికే అమెరికా, న్యూజిలాండ్‌తోపాటు పలు దేశాలు నిషేధం విధించాయి. కాగా ఈ సంస్థపై భారత్‌లో 2010 నుంచి నిషేధం అమల్లో ఉంది.
పుకుషిమా ప్రమాదం మానవ తప్పిదమే
జపాన్‌లోని పుకుషిమా అణు కర్మాగార ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని.. ఈ దుర్ఘటనపై విచారణ నిర్వహించిన అత్యున్నత స్థాయి పార్లమెంటరీ విచారణ కమిషన్ జూలై 5న తెలిపింది. భూకంపాలు సంభవిస్తే తట్టుకునే స్థాయిలో అణు విద్యుత్ కేంద్రం లేదని పేర్కొంది.
ఈ విపత్తును ముందుగానే అంచనా వేసి, నివారించే అవకాశం ఉందని విచారణ కమిషన్ వాఖ్యానించింది. 2011 మార్చిలో సంభవించిన భారీ సునామీకి పుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రం బాగా దెబ్బతింది. రియాక్టర్లు కరిగిపోయి రేడియేషన్ విస్తారంగా వెలువ డటంతో వేలాది మందిని ఆ ప్రాంతం నుంచి తరలించాల్సి వచ్చింది.
ఐరాస ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2012
2011లో భారత్‌లోకి 32 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) వచ్చాయని ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కాన్ఫరెన్స్ (అంక్టాడ్) ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2012 తెలిపింది. 2011 దక్షిణాసియా దేశాల్లోకి 39 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా అందులో భారత్‌కు 32 బిలియన్ డాలర్లు వచ్చాయని నివేదిక పేర్కొంది.
గత సంవత్సరంతో పోల్చితే 2011లో 23 శాతం ఎక్కువ ఎఫ్‌డీఐలు వచ్చాయి. భారత్ ఉత్తమ పనితీరు వల్లే దక్షిణాసియాకు పెట్టుబడులు పెరిగాయని అంక్టాడ్ నివేదిక తెలిపింది. భారత్- పాకిస్థాన్‌ల మధ్య మెరుగుపడుతున్న రాజకీయ సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలకు దారి తీస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది.
తూర్పు ఆసియా సదస్సు-విద్యా మంత్రుల సమావేశం
మొదటి తూర్పు ఆసియా సదస్సు- విద్యా మంత్రుల సమావేశం జూలై 5న ఇండోనేషియాలోని యోగ్యకర్తలో ముగిసింది. మూడు రోజులు జరిగిన ఈ సమావేశానికి భారత్ తరపున కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డి.పురంధేశ్వరి హాజరయ్యారు. ‘ప్రాంతీయ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం’ ఏర్పాటు చేయాలని ఆమె ఈ సందర్భంగా ప్రతిపాదించారు. ఆసియన్ సభ్యదేశాల నుంచి, ఈ ప్రాంతంలోని ఇతర దేశాల నుంచి విద్యా మంత్రులు, ఉన్నత స్థాయి విద్యా అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

Total Pageviews

Template Information

Template Information