June - 2012


28 జూన్ - 04 జూలై 2012 జాతీయం

జాతీయం
ప్రణబ్ రాజీనామా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ జూన్ 26న తన పదవికి రాజీనామా చేశారు. జూలై 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రణబ్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలతోపాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించారు.

వీరభద్ర సింగ్ రాజీనామా
కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి వీరభద్రసింగ్ జూన్ 26న తన పదవికి రాజీనామా చేశారు. 1989 నాటి లంచం కేసులో హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు మంత్రితోపాటు ఆయన భార్యపై అభియోగాలు నమోదు చేయడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. 1989లో ఆయన హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామిక వేత్తల నుంచి ముడుపులు పొందారని ఆరోపణ. ఈ లావాదేవీలకు సంబంధించిన సంభాషణల ఆడియో సీడీ 2007లో వెలుగు చూసింది. దీంతో వీరభద్రసింగ్‌పై 2009 ఆగస్టులో కేసు నమోదు చేశారు.

కల్పనా చావ్లా పేరిట పథకం
బెంగళూరు మహానగర పాలిక మహిళల ఆర్థిక స్వావలంబన కోసం దివంగత వ్యోమగామి కల్పనా చావ్లా పేరిట కొత్త పథకాన్ని జూన్ 28న ప్రకటించింది. మహిళ కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహించే 50 వార్డుల్లో పేద మహిళలను గుర్తించి కంప్యూటర్ కోర్సులు, కుట్టు, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్స్ తదితర వాటిల్లో శిక్షణ నిస్తారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్, సంగ్మా నామినేషన్లు
భారత నూతన రాష్ట్రపతి కోసం జూలై 19న జరిగే ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ జూన్ 28న నామినేషన్ దాఖలు చేశారు. ఆదే రోజు లోక్‌సభ మాజీ స్పీకర్ పి.ఎ.సంగ్మా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈయనకు బీజేపీ, బీజేడీ,
ఏఐఏడీఎంకె పార్టీలు మద్దతిస్తున్నాయి. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో 10.98 లక్షల ఓట్లు ఉన్నాయి. రాష్ట్రపతిగా గెలవాలంటే ఒక అభ్యర్థికి కావల్సిన ఓట్లు 5,49,442.

సుర్జీత్ సింగ్‌ను విడుదల చేసిన పాక్
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టై 31 ఏళ్లుగా పాకిస్థాన్‌లో జైలు జీవితం గడిపిన భారత్‌కు చెందిన సుర్జీత్‌సింగ్(69)ను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 28న ఆయన వాఘా సరిహద్దు గుండా భారత్‌లో అడుగు పెట్టారు. గూఢచర్యానికి పాల్పడ్డాడం టూ 1980లో సుర్జీత్‌ను పాక్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం పాక్ సైనిక చట్టాల ప్రకారం 1985లో మరణశిక్ష విధించారు. అయితే ఈ శిక్షను 1989లో నాటి పాక్ అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ జీవితఖైదుకు తగ్గించారు.

రాష్ట్రీయం
నూతన సీఎస్‌గా మిన్నీ మాథ్యూ
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా పనిచేస్తున్న మిన్నీ మాథ్యూ నియమితులయ్యారు. మాథ్యూ వచ్చే ఏడాది జనవరిలో పదవీ విరమణ చేస్తారు. 1976 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన మాథ్యూ స్వరాష్ట్రం కేరళ. ఈమె సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ కాగా.. తొలి మహిళా సీఎస్ (2002లో) సతీనాయర్ కూడా కేరళకు చెందినవారే.

25 పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం
రాష్ట్రంలో రూ.40,379 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పే 25 పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి జూన్ 27న ఆమోదం తెలిపింది. వీటిని కడప, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, విజయనగరం, పశ్చిమగోదావరి, విశాఖపట్నంలలో నెలకొల్పుతారు.

శ్రీకాకుళంలో ‘ఈ వాణి’
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న సరుకుల సమాచారాన్ని వాయిస్ మెయిల్ ద్వారా రేషన్ కార్డుదారులకు చేరవేసే విధానం ‘ఈ వాణి’ శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. ఈ విధానంలో సరుకులు రేషన్ దుకాణాలకు విడుదలైన వెంటనే వినియోగదారుల మొబైల్ ఫోన్లకు వాయిస్ మెయిల్ ద్వారా సమాచారం వెళుతుంది.

21- 27 జూన్ 2012

జాతీయం
అడ్వాంటేజ్ ఏపీ-2012
ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించేందుకు ఉద్దేశించిన ‘అడ్వాంటేజ్ ఏపీ-2012’ సదస్సు జూన్ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగింది. ఈ సదస్సులో 2012-17 కాలంలో అమల్లో ఉండే ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పాలసీని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విడుదల చేశారు.
ఇందులో రాష్ట్ర రాజధాని సహా పలు ఇతర నగరాల్లో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన ప్రోత్సాహకాలు, ప్రస్తుత ఫ్యాబ్‌సిటీ, ఏరోనాటికల్ సెజ్‌లను ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పరిశ్రమలకు ఆయువుపట్టుగా మార్చడం,పరిశోధన, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం, అనుమతుల కోసం సింగిల్ విండోను ఏర్పాటుచేయడం, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ కంపెనీలకు రాయితీలు వంటి తదితర అంశాలు ఉన్నాయి.
దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి సచిన్ పైలట్ ఈ సందర్భంగా వెల్లడిం చారు. రూ.20 వేల కోట్లతో రానున్న మూడేళ్లలో ఈ ప్రాజె క్టు పూర్తిచేయనున్నట్లు పైలట్ వివరించారు.
ఐటీసీ సోషల్ ఫారెస్ట్రీకి అంతర్జాతీయ అవార్డు
ఖమ్మం జిల్లాలో ఐటీసీ సంస్థ అమలు చేస్తున్న సామాజిక వనాల పెంపకం పథకానికి(సోషల్ ఫారెస్ట్రీ), 2012 వరల్డ్ బిజినెస్ అండ్ డెవలప్‌మెంట్ అవార్డు లభించింది. రియో డి జనీరో(బ్రెజిల్)లో నిర్వహించిన రియో+20 ధరిత్రీ శిఖరాగ్ర సదస్సులో ఈ పురస్కారాన్ని ఐటీసీకి ప్రదానం చేశారు.
భారత్‌లో ఈ అవార్డు అందుకున్న ఏకైక సంస్థ ఐటీసీ. రాష్ట్రంలో 1,25,000 హెక్టార్లలో సామాజిక వనాల పెంపకం పూర్తి చేసి 56 మిలియన్ల పని దినాలను కల్పించడంలో విజయం సాధించినందుకుగాను ఐటీసీకీ ఈ పురస్కారం లభించింది.
ఎన్‌ఐఏ తొలి చీఫ్ రాధా వినోద్ మృతి
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) వ్యవస్థాపక డెరైక్టర్ జనరల్ రాధా వినోద్ రాజు(62) కొచ్చిలో జూన్ 21న మరణించారు. 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 26/11 ముంబై దాడుల అనంతరం ఎన్‌ఐఏను ఏర్పాటు చేశారు.
14- 20 జూన్ 2012
జాతీయం
బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు గాంధీ అవార్డు
భారత్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్ సేన్, బులూ ఇమామ్‌లకు లండన్‌లోని గాంధీ ఫౌండేషన్ అంతర్జాతీయ శాంతి పురస్కారాలను ప్రకటించింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వీరికి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. బెంగాల్‌కు చెందిన పిల్లల వైద్యుడైన సేన్ ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. ముఖ్యంగా ఛ త్తీస్‌గఢ్ రాష్ట్రంలో గిరిజనుల ఆరోగ్యం కోసం విశేష కృషి చేశారు. జార్ఖండ్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త బులూ ఇమామ్ పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అంతర్జాతీయ శాంతి అవార్డును గాంధీ ఫౌండేషన్ 1998 లో ఏర్పాటు చేసింది. గాంధీ సిద్ధాంతాలను ప్రభోదిస్తూ, అహింసా మార్గాన్ని అనుసరించే వ్యక్తులు, గ్రూపులకు ఈ పురస్కారాన్ని బహూకరిస్తారు.
ఐటీడీసీ చైర్మన్‌గా వాఘేలా
ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) చైర్మన్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా జూన్ 13న బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అశోకా గ్రూప్ హోటళ్లను ఐటీడీసీ నిర్వహిస్తోంది. ఐటీడీసీ చైర్మన్‌కు కేబినెట్ స్థాయి హోదా ఉంటుంది.
భారత వృద్ధి రేటు 6.9 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2012-13లో 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ‘గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్’ పేరిట ప్రపంచ బ్యాంకు జూన్ 12న విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం భారత్ 2013-14లో 7.2 శాతం, 2014-15లో 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుంది. సంస్కరణలు నిలిచిపోవడం, విద్యుత్ సమస్య, బలహీన ద్రవ్య విధానం వంటి కారణాలతో గత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి సన్నగిల్లిందని నివేదిక విశ్లేషించింది. 2011-12లో భారత జీడీపీ 6.5 శాతానికి క్షీణించింది.

బార్క్ డెరైక్టర్‌గా శేఖర్ బసు
బాబా అణు పరిశోధన కేంద్రం(బార్క్) డెరైక్టర్‌గా శేఖర్ బసు నియమితులయ్యారు. ప్రస్తుతం బసు న్యూక్లియర్ రీసైకిల్ బోర్డుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఐబీఏ చైర్మన్‌గా అలోక్ మిశ్రా
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ అలోక్ మిశ్రా ఎన్నికయ్యారు. కె.ఆర్. కామత్ (పంజాబ్ నేషనల్ బ్యాంక్), జేపీ దువా(అలహాబాద్ బ్యాంక్), చందా కొచ్చర్(ఐసీఐసీఐ బ్యాంక్) డిప్యూటీ చైర్ పర్సన్‌లుగా ఎన్నికయ్యారు.

07- 13 జూన్ 2012
 
సీఈసీగా వి.ఎస్.సంపత్
నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా వీరవల్లి సుందరం(వి.ఎస్.) సంపత్ జూన్ 6న నియమితులయ్యారు. ఎస్.వై. ఖురేషి స్థానంలో జూన్ 11న సంపత్ బాధ్యతలు స్వీకరించారు. 2015 జనవరిలో 65 ఏళ్ల వయసులో ఆయన పదవీ విరమణ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం కమిషనర్ లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆరేళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే దాకా (వీటిలో ఏది ముందు పూర్తయితే అది) పదవిలో కొనసాగుతారు. ఎన్నికల సంఘంలో ఇప్పుడు ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో 62 ఏళ్ల సంపత్, హెచ్.ఎస్. బ్రహ్మ కంటే సీనియర్ కావడంతో సంప్రదాయాన్ని పాటించి ఆయనకే సీఈసీగా పదోన్నతి కల్పించారు. సంపత్ 2009 ఏప్రిల్‌లో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన 1973 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.
నౌకాదళ ప్రధానాధికారిగా దేవేంద్ర జోషి
భారత నౌకాదళ ప్రధానాధికారిగా వైస్ అడ్మిరల్ దేవేంద్ర జోషి నియమితులు కానున్నారు. జలాంతర్గాముల విధ్వంసక యుద్ధతంత్రంలో నిపుణుడైన జోషి ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ ముఖ్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. 2012 ఆగస్ట్ 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత నౌకాదళాధిపతి అడ్మిరల్ నిర్మల్ వర్మ స్థానంలో జోషి బాధ్యతలు స్వీకరిస్తారు. మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జోషి 1974 ఏప్రిల్ 1న
భారతీయ నౌకదళంలో ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.
ఆనంద్ మహీంద్రాకు లీడర్‌షిప్ అవార్డు
భారత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా యూఎస్ - ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ) నాయకత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయనతోపాటు అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ అలన్ ములాలీ కూడా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సంస్థ భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందింపజేయడానికి కృషి చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన బాలికల నిష్పత్తి
ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి 943కు తగ్గింది (ఇది 2001లో 961). ఆరు సంవత్సరాలలోపు ప్రతి 1000 మంది బాలురకు బాలికల నిష్పత్తి పట్టణాల్లో 946 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 942గా ఉంది (ఇది 2001 లో పట్టణాల్లో 963, గ్రామీణ ప్రాంతాల్లో 955). రాష్ట్ర జనగణన విభాగం జూన్ 7 విడుదల చేసిన మండలాల వారీ జనాభా ఈ వివరాలను వెల్లడించాయి.
రాష్ట్ర మొత్తం జనాభా:
* 8,46,65,533 (గ్రామీణ జనాభా-5,63,11,788. పట్టణ జనాభా-2,83,53,745).
* రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పట్టణ జనాభాతో పోల్చితే గ్రామీణ జనాభా వృద్ధి రేటు తగ్గింది.
* అత్యధిక జనాభా ఉన్న మండలాల జాబితాలో 10.35 లక్షల జనాభాతో విజయవాడ అర్బన్ తొలిస్థానంలో నిలవగా.. మారేడుమిల్లి (తూర్పుగోదావరి)కి చివరి స్థానం దక్కింది.
* రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు 992 మంది స్త్రీలు ఉన్నారు. బాల బాలికల (0 నుంచి 6 ఏళ్ల వయసు) నిష్పత్తి అత్యంత తక్కువగా నల్గొండ జిల్లా చిట్యాల(528)లో నమోదయింది. రెండో స్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ మండలం (704) నిలిచింది.
* రాష్ట్ర సగటు అక్షరాస్యత 67.66 శాతం (దేశ సగటు అక్షరాస్యత 74.04). 2001లో 2.61 కోట్ల మంది నిరక్షరాస్యులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 2.45 కోట్లకు తగ్గింది.
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌గా ఆర్‌పీ సింగ్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) నూతన చైర్మన్‌గా రాజీందర్ పాల్ సింగ్ (ఆర్.పి.సింగ్) జూన్ 11న నియమితులయ్యారు. ఈయన 1976 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి. ఆర్.పి.సింగ్ ఈ పదవిలో మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కొనసాగుతారు.
జాతీయం
ఐఎస్‌సీఏ శత వార్షికోత్సవం
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్(ఐఎస్‌సీఏ) శత వార్షికోత్సవాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జూన్ 2న కలకత్తా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాదిని ‘భారత్‌లో శాస్త్ర సంవత్సరం’గా ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 100 పరిశోధన ఫెలోషిప్‌లు అందించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2003 నాటి విధానపత్రం స్థానంలో శరవేగంగా మారిపోతున్న శాస్త్రరంగాన్ని ప్రతిబింబిస్తూ నూతన శాస్త్రసాంకేతిక విధానాన్ని రూపొందిస్తామన్నారు.
 
జాతీయ టెలికాం విధానం 2012కు కేబినెట్ ఆమోదం
జాతీయ నూతన టెలికాం విధానం(ఎన్‌టీపీ) 2012కు కేంద్ర కేబినెట్ మే 31న ఆమోదం తెలిపింది. కొత్త విధానం వల్ల రోమింగ్ చార్జీలు రద్దవుతాయి. దేశమంతటా ఉచిత రోమింగ్, పూర్తి స్థాయి నెంబర్ పోర్టబిలిటీ అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఎక్కడ ఏ నెట్‌వర్క్‌కు మారినా ప్రస్తుతం ఉపయోగిస్తున్న నెంబరునే ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 39 శాతం టెలికాం సర్వీసులను 2020 నాటికి 100 శాతానికి పెంచుతారు. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను కనీసం 2 ఎంబీపీఎస్‌కు పెంచుతారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. కొత్త విధానంలో ఆపరేటర్లకు లెసైన్సులు, స్పెక్ట్రమ్ విడిగా కల్పిస్తారు. ఏకీకృత లెసైన్సింగ్ విధానం అమల్లోకి వస్తుంది. ఆపరేటర్లు కేవలం ఒకే టెక్నాలజీకి పరిమితం కాకుండా ఏ టెక్నాలజీ ద్వారానైనా సర్వీసులు అందించవచ్చు.
సైనికాధిపతిగా బిక్రమ్ సింగ్
భారత సైనిక దళానికి 25వ సైనికాధిపతిగా జనరల్ బిక్రమ్ సింగ్ మే 31న బాధ్యతలు స్వీకరించారు. జనరల్ విజయ్ కుమార్ (వీకే) సింగ్ నుంచి పగ్గాలు చేపట్టిన బిక్రమ్ సింగ్ రెండు సంవత్సరాల మూడు నెలలపాటు పదవిలో కొనసాగుతారు. ఇంతకుముందు ఈయన కోల్‌కతా కేంద్రంగా ఉన్న తూర్పు సైనిక విభాగం అధిపతిగా పని చేశారు. ఇండియన్ మిలటరీ అకాడమీ ద్వారా 1972, మార్చి 31న సిఖ్ లైట్ ఇన్‌ఫ్రాంటీ రెజిమెంట్‌లో చేరడం ద్వారా కెరీర్ ప్రారంభించారు.
హైదరాబాద్‌లో బ్రిటన్ కాన్సులేట్
బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయా(కాన్సులేట్)న్ని మే 31న హైదరాబాద్‌లో ఆ దేశ దౌత్య విభాగాధిపతి సైమన్ ఫ్రేజర్ ప్రారంభించారు. ఇది హైదరాబాద్‌లో మూడో కాన్సులేట్ కార్యాలయం. మొదట ఇరాన్, 2008 లో అమెరికాలు తమ కాన్సులేట్ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయి. దీంతో భారత్‌లో బ్రిటన్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయాల సంఖ్య ఏడుకు చేరింది.
భట్టాచార్యకు బ్రిటన్ సాహిత్య పురస్కారం
బ్రిటన్ రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ప్రదానం చేసే ‘ఆన్‌డాట్జీ-2012’ బహుమతికి ఢిల్లీకి చెందిన రాహుల్ భట్టాచార్య ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘ద స్లై కంపెనీ ఆఫ్ పీపుల్ హూ కేర్’ నవలకుగాను ఈ బహుమతి లభించింది. భారతీయ పాత్రికేయుడి సాహసకృత్యాలే ఇతివృత్తంగా ఈ నవల సాగుతుంది. ఒక భారతీయుడికి తొలిసారిగా ఈ అవార్డు దక్కింది. భట్టాచార్య ‘పండిట్స్ ఫ్రమ్ పాకిస్థాన్’ అనే క్రికెట్ పుస్తకాన్ని కూడా రాశారు.
‘ఆకాశ్’ పరీక్ష విజయవంతం
వైమానిక దళంలో ఉపయోగించే ‘ఆకాశ్’ క్షిపణులను ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టె స్ట్ రేంజ్ నుంచి జూన్ 1న విజయవంతంగా పరీక్షించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షి పణులు 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణి 60 కిలోల బరువుగల వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.

Total Pageviews

Template Information

Template Information